Share News

COVID-19: పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచన

ABN , Publish Date - Dec 24 , 2023 | 06:59 PM

అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక సూచన చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కోవిడ్ 19 కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

COVID-19: పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచన

అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక సూచన చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కాగా ఇటీవల ఆగ్నేసియా దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ 19 కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. కరోనా, దాని నూతన వేరియంట్ JN.1, ఇన్ల్ఫుఎంజా నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలను డబ్ల్యూహెచ్‌ఓ కోరింది. ‘‘కోవిడ్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో పరిణామం చెందుతూ, రూపాంతరం చెందుతూ, వ్యాప్తి చెందుతూనే ఉంది. JN.1 వల్ల కలిగే అదనపు అనారోగ్య ప్రమాదం తక్కువగా ఉందని ప్రస్తుతం ఉన్న సాక్ష్యాలను బట్టి తెలుస్తున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. కరోనా కేసులు నమోదవుతున్న దేశాలు తమ నిఘాను బలోపేతం చేయాలి. కేసుల డేటాను బయటికి చెప్పాలి.’’ అని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు.


శీతాకాలంలో వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల కోవిడ్ 19 కేసుల పెరుగుదలకు కారణమవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేసింది. "సెలవుల్లో ప్రజలంతా ప్రయాణాలు, పండుగల కోసం గుమిగూడుతుంటారు. ఇంటి లోపల ఎక్కువ సమయం గడుపుతారు. అది శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వైరస్‌ల వ్యాప్తిని సులభతరం చేస్తుంది. దీంతో తప్పనిసరిగా రక్షణ చర్యలు తీసుకోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు సకాలంలో వైద్యులను సంప్రదించాలి. డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన అన్ని కోవిడ్-19 వ్యాక్సిన్‌లు JN.1తో సహా అన్ని కరోనా వేరియంట్‌ల నుంచి రక్షణను ఇస్తాయి." అని డాక్టర్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. కాగా గత మే నెలలో కరోనా కేసులు తగ్గాయి. దీంతో కరోనాతో ఆసుపత్రిలో చేరేవారు, మరణాలు సంఖ్య తగ్గిపోయింది. దీంతో కరోనా కారణంగా ఇకపై అంతర్జాతీయంగా ఆందోళనకర అత్యవసర పరిస్థితి ఉండదని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. కానీ తాజాగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కల్గించే అంశంగా మారింది.

Updated Date - Dec 24 , 2023 | 06:59 PM