News Paper Selling: ఇకపై న్యూస్ పేపర్ అమ్మితే నేరుగా జైలుకే.. చరిత్రలో ఎన్నడూ లేని వింత చట్టం.. ఎక్కడో తెలుసా?

ABN , First Publish Date - 2023-08-13T18:24:00+05:30 IST

పాత న్యూస్ పేపర్లను మనం ఏం చేస్తాం? మహా అయితే ఇంట్లో వాడుకోవడమో, తూకానికి అమ్మేసి క్యాష్ చేసుకోవడమో చేస్తుంటాం. ఇక చిరు వ్యాపారులు అయితే, పొట్లాలు కట్టడానికి ఈ వార్తా పత్రికలు వినియోగిస్తుంటారు. కానీ..

News Paper Selling: ఇకపై న్యూస్ పేపర్ అమ్మితే నేరుగా జైలుకే.. చరిత్రలో ఎన్నడూ లేని వింత చట్టం.. ఎక్కడో తెలుసా?

పాత న్యూస్ పేపర్లను మనం ఏం చేస్తాం? మహా అయితే ఇంట్లో వాడుకోవడమో, తూకానికి అమ్మేసి క్యాష్ చేసుకోవడమో చేస్తుంటాం. ఇక చిరు వ్యాపారులు అయితే, పొట్లాలు కట్టడానికి ఈ వార్తా పత్రికలు వినియోగిస్తుంటారు. కానీ.. ఇకపై ఇలాంటివి చేయడం చట్టరీత్యా నేరం. పనికిరాదని చించేసినా, ఇంట్లో వాడినా, పొట్లాలుగా కట్టినా, చివరికి అమ్మినా సరే.. తీసుకెళ్లి నేరుగా జైల్లో పడేస్తారు. ఒకవేళ అధికారులకి తిక్కరేగితే.. భారీ జరిమానా విధించే అవకాశమూ లేకపోలేదు. అయితే.. ఈ వింత చట్టం వచ్చింది మన భారత్‌లో కాదులెండి, నార్త్ కొరియాలో! తానో మోనార్క్‌నని చెప్పుకునే ఈ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఈ వింత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉందండోయ్. పదండి.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.


ఉత్తర కొరియాలో ‘రోడాంగ్ సిన్మున్’ అనే ఒక ప్రముఖ వార్తా పత్రిక ఉంది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భజన చేయడమే ఈ న్యూస్ పేపర్ పని. కిమ్‌కి సంబంధించిన ఫోటోలను పెద్ద పెద్దగా వేసి, అతని గొప్పదనాన్ని వివరిస్తూ ఆర్టికల్స్ రాస్తుంది. ఈ న్యూస్ పేపర్‌కి ఒక వింత నియమం ఉంది. అదేమిటంటే.. ఎవరైనా దీనిని కొనుగోలు చేస్తే, తప్పకుండా పేపర్‌ని పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఒకవేళ కాపీలు మిగిలిపోతే.. కిమ్ గౌరవార్థం ఆ కాపీల్ని పడేయకుండా నిల్వ ఉంచుతారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ రోడాంగ్ సిన్మున్ పేపర్‌ని ప్రజలు తమ అవసరాలకు బాగా వినియోగించుకుంటున్నారు. సిగరెట్ రోలింగ్ పేపర్‌గా, పార్సిల్ పేపర్‌గా, ఇంకా రకరకాల అవసరాలకి వాడుతున్నారు. ఇక్కడే కిమ్ జోంగ్ ఉన్‌కి మండింది. ఇది తనని భజన చేసే పేపర్ కాబట్టి, ప్రజలు ఇష్టానుసారం వాడటం నచ్చలేదు. పైగా.. తన ఫోటోలున్న పేపర్లను అడ్డదిడ్డంగా ప్రజలు ఉపయోగించడం అతనికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతగాడు.. ఈ పేపర్ అమ్మకూడదంటూ సరికొత్త చట్టం తీసుకొచ్చేశాడు.

అంటే.. ఇకపై ఈ రోడాంగ్ సిన్మున్ వార్తా పత్రికని అమ్మినా, సిగరెట్ రోలింగ్‌గా వినియోగించినా, అసలు రోడ్డు మీద పడేసినా.. నేరుగా తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు. ఈ పేపర్‌ని అగౌరవపరిస్తే, కిమ్ జోంగ్ ఉన్‌ని అగౌరవపరచడమేనని అక్కడి ప్రభుత్వం సైతం వెల్లడించింది. ‘ఎవరు గమనిస్తారులే’ అని నిర్లక్ష్యం వహిస్తే.. పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్కడి పోలీసులు మఫ్టీల్లో తిరగడం మొదలుపెట్టారు. ఖర్మగాలి ఎవరైనా పేపర్ పారేస్తే.. ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండానే ఎత్తుకెళ్లిపోతున్నారు. శిక్ష కింద రెండు సంవత్సరాల వరకు లేబర్ క్యాంప్‌లకు పంపిస్తున్నారు. పేపర్ విషయంలో కిమ్ జోంగ్ ఉన్ ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడంటే.. అతడు ఎలాంటి అధ్యక్షుడో మీరే అర్థం చేసుకోండి.

Updated Date - 2023-08-13T18:24:00+05:30 IST