Share News

Nepal earthquake: పెను విషాదం.. నేపాల్ భూకంపంలో 100 దాటిన మృతుల సంఖ్య.. ఇప్పటివరకు మొత్తం ఎంతమంది చనిపోయారంటే..?

ABN , First Publish Date - 2023-11-04T09:19:24+05:30 IST

నేపాల్‌లో అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ భూకంపంలో మృతుల సంఖ్య 100 దాటింది. ఇప్పటివరకు 128 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

Nepal earthquake: పెను విషాదం.. నేపాల్ భూకంపంలో 100 దాటిన మృతుల సంఖ్య.. ఇప్పటివరకు మొత్తం ఎంతమంది చనిపోయారంటే..?

నేపాల్‌లో అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ భూకంపంలో మృతుల సంఖ్య 100 దాటింది. ఇప్పటివరకు 128 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే నేపాల్ టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకుమ్ జిల్లాలో 140 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రమాదంలో అనేక ప్రాంతాలు పూర్తిగా నాశనమయ్యాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను రక్షించేందుకు, వారిని ఆసుపత్రులకు తరలించడానికి మూడు భద్రతా ఏజెన్సీలను ఏర్పాటు చేసినట్లు నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ కార్యాలయం వెల్లడించింది. అలాగే ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలతో సహా ఇతర జిల్లాల నుంచి క్షతగాత్రులు, ఆస్తి నష్టానికి సంబంధించిన నివేదికలు వస్తున్నాయని నేపాల్ హోమంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారికి ఖాట్మండుకు పశ్చిమాన 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న జాజర్‌కోట్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.


కాగా జాజర్‌కోట్‌లోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత నేపాల్ హోం మంత్రిత్వ శాఖ 24 మృతదేహాలను వెలికితీసింది. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాలు అంధకారంగా మారిపోయాయి. ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు సైతం కంపించాయి. నేపాల్‌కు 800 కి.మీ దూరంలో ఉన్న ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీలోని ప్రజలు ఏం జరుగుతుందో తెలియక రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా నేపాల్‌లో గత సంవత్సరం నవంబర్ 22న దోటి జిల్లాలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఆరుగురు మరణించారు. దేశాన్ని కుదిపేసిన వరుస భూకంపాలలో ఇది ఒకటి. నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏకంగా 12 వేలకు పైగా మరణించారు. సుమారు ఒక మిలియన్ నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఈ విషాదాలను మరిచిపోకముందే నేపాల్‌లో మరో తీవ్ర భూకంపం సంభవించింది.

Updated Date - 2023-11-04T09:19:26+05:30 IST