Vivek Ramaswamy: ట్రంప్‌ను కంగారు పెడుతున్న భారతీయులు.. అమెరికా అధ్యక్ష రేసులో దూకుడు!

ABN , First Publish Date - 2023-09-21T12:59:36+05:30 IST

రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. అధ్యక్ష రేసులో ఇది వరకు మూడో స్థానంలో ఉన్న రామస్వామి తాజాగా రెండో స్థానానికి ఎగబాకారు.

Vivek Ramaswamy: ట్రంప్‌ను కంగారు పెడుతున్న భారతీయులు.. అమెరికా అధ్యక్ష రేసులో దూకుడు!

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. అధ్యక్ష రేసులో ఇది వరకు మూడో స్థానంలో ఉన్న రామస్వామి తాజాగా రెండో స్థానానికి ఎగబాకారు. ఆ వెంటనే మూడో స్థానంలో మరో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ ఉండడం గమనార్హం. దీంతో అధ్యక్ష రేసులో భారత సంతతి అభ్యర్థుల నుంచి చివరి వరకు డోనాల్డ్ ట్రంప్‌నకు గట్టి పోటీ తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ రేసులో ట్రంపే ముందంజలో ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి పరిస్థితి మారే అవకాశాలు లేకపోలేదు. పైగా భారత సంతతి అభ్యర్థుల దూకుడుతో ఇంతకాలం ట్రంప్‌నకు ప్రధాన పోటీ దారునిగా కనిపించిన ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్ బాగా వెనకబడ్డారు. ఈ రేసులో ఆయన ఏకంగా ఐదో స్థానానికి పడిపోయారు. ముఖ్యంగా ఇటీవల రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌లో భారత అభ్యర్థులు రామస్వామి, నిక్కీ హేలీ సత్తా చాటారు. దీంతో అప్పటినుంచి వీరి పాయింట్లు పెరుగుతూ వచ్చాయి.


ప్రస్తుతం రిపబ్లికన్లు అధ్యక్ష అభ్యర్థి రేసులో డోనాల్డ్ ట్రంప్ మంచి అధిక్యంతో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రైమరీ పోల్స్‌లో ట్రంప్‌నకు 39 శాతం మంది మద్దతు లభించింది. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న రామస్వామికి 13 శాతం, మూడో స్థానంలో ఉన్న నిక్కీ హేలీకి 12 శాతం మంది మద్దతు తెలిపారు. ఇంతకుముందు ట్రంప్‌నకు ప్రధాన పోటీదారుడిగా భావించిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ గత జూలైలో 26 శాతం ఓటర్ల మద్దతుతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. కానీ తాజాగా ఆయనకు 6 శాతం మద్దతు మాత్రమే లభించింది. దీంతో రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. ఈ రేసులో నాలుగో స్థానంలో న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ ఉన్నారు. ఆయనకు 11 శాతం ఓటర్ల మద్దతు లభించింది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఆ లోగా పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి. ట్రంప్ మరింత పుంజుకోవచ్చు. లేదంటే భారత సంతతి అభ్యర్థులు అధ్యక్ష రేసులోకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి ట్రంప్‌ను భారత సంతతి అభ్యర్థులు కంగారు పెడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. కానీ చివరగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడైన్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే రిపబ్లికన్ల తరఫున వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానని ట్రంప్ ఆ సమయంలోనే ప్రకటించారు.

Updated Date - 2023-09-21T12:59:36+05:30 IST