Google: గూగుల్ చేసిన పనికి ఆ మహిళ బతుకు బస్టాండ్.. అసలేమైందంటే?

ABN , First Publish Date - 2023-09-29T15:55:50+05:30 IST

తమ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ప్రైవేట్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా మినహాయింపు కాదు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే..

Google: గూగుల్ చేసిన పనికి ఆ మహిళ బతుకు బస్టాండ్.. అసలేమైందంటే?

తమ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ప్రైవేట్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా మినహాయింపు కాదు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే, ఉన్నపళంగా ఎంప్లాయిస్‌ని సంస్థ నుంచి తీసేస్తున్నారు. దీంతో.. చాలామంది రోడ్డున పడ్డారు. ఇప్పుడు తాజాగా ఓ మహిళ కూడా తన ఉద్యోగం కోల్పోయింది. గత 12 సంవత్సరాల నుంచి కంపెనీనే నమ్ముకొని పని చేసిన ఆమెను.. గూగుల్ సంస్థ ఒక్కసారిగా తొలగించింది. దీంతో.. తన గుండె పగిలినంత పనైందని ఆ మహిళ లింక్డ్‌ఇన్ మాధ్యమంగా తన ఆవేదనని వ్యక్తం చేసింది. బిడ్డకు జన్మనిచ్చిన 10 వారాల తర్వాత తాను ఉద్యోగం కోల్పోయానంటూ తన దీనస్థితిని వివరించింది.

‘‘నేను గూగుల్ సంస్థలో గత 12.5 సంవత్సరాలగా పని చేస్తున్నాను. కానీ.. గత వారం జరిగిన రిక్రూటింగ్ లేఆఫ్స్‌లో భాగంగా ఉద్యోగం కోల్పోయాను. దురదృష్టవశాత్తూ.. నేను మెటర్నిటీ లీవ్‌లో ఉన్నాను’’ అని ఆ మహిళా ఉద్యోగి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అయితే.. తన ఉద్యోగం పోయినా, ఇన్నాళ్లూ పని చేసినందుకు గాను ఆ సంస్థపై తనకున్న మమకారాన్ని ఆ మహిళ పంచుకుంది. గూగుల్‌లో పనిచేసినంత కాలం అక్కడున్న కొలీగ్స్ తనని కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని.. అందుకు వారికి, అలాగే స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొంది. ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగం దొరకడం కష్టమే కానీ.. తర్వాత ఏం జరుగుతుందో చూసేందుకు ఉత్సాహంగా ఉన్నానని.. పాజిటివ్ మైండ్‌సెట్‌ని కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది.


ఇదే సమయంలో.. తనకు ఎవరైనా కొత్త జాబ్ ఇప్పించాలని ఆ మహిళ కోరింది. ఏదైనా కంపెనీలో స్టాఫింగ్ మేనేజర్ లేదా ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగాలు ఉంటే.. తనని గుర్తించుకోవాలని పేర్కొంది. అలాగే.. ఎవరైనా ఐసీ రిక్రూటర్‌ల కోసం చూస్తున్నట్లైతే తనకు తెలియజేయాలని చెప్పింది. తన సహోద్యోగుల్లోనూ చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయారని, కాబట్టి ఉద్యోగాలు ఉంటే వారికి సహాయం చేసినవారు అవుతారని ఆమె లింక్డ్‌ఇన్‌లో తెలిపింది. ఈ పోస్టు నెటిజన్ల హృదయాలను తాకడంతో.. ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాధారణంగా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు కొందరు కోపంతో పోస్టులు పెడతారు. కానీ.. అందుకు భిన్నంగా ఈ మహిళ పాజిటివ్‌గా పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఇదిలావుండగా.. ఈ నెల ప్రారంభంలో గూగుల్ సంస్థ తన రిక్రూట్‌మెంట్ టీమ్ నుంచి వందలాది మందిని తొలగించింది. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హెచ్ఆర్ టీమ్‌ని తొలగించడానికి ముందు.. ఈ ఏడాది ప్రారంభంలో (జనవరి) 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన రెండు నెలల తర్వాత వేజ్ మ్యాపింగ్ యాప్ విభాగంలో చాలామందిని తొలగించింది. ఇంకా ఈ తొలగింపు ప్రాసెస్‌ని కొనసాగిస్తూనే ఉంది.

Updated Date - 2023-09-29T15:55:50+05:30 IST