Oral health: నోటి ఆరోగ్యం ఇలా క్షేమం!

ABN , First Publish Date - 2023-02-21T12:25:43+05:30 IST

పంటి నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడే, దంత వైద్యులను కలుస్తాం. కానీ అప్పటికే పంటి సమస్య విషమించి

Oral health: నోటి ఆరోగ్యం ఇలా క్షేమం!
నాలుక మందబారితే?

పంటి నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడే, దంత వైద్యులను కలుస్తాం. కానీ అప్పటికే పంటి సమస్య విషమించి, రూట్‌ కెనాల్‌ చికిత్సలు, కట్టుడు దంతాలు అవసరమవుతాయి. చిగుళ్ల సమస్యలు, ఎగుడు దిగుడు దంతాలు, కొన్ని రకాల అలవాట్లు లాంటివన్నీ దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే! కాబట్టి దంతాలు, చిగుళ్లు, నాలుక, నోట్లోని మ్యూకస్‌ మెంబ్రేన్లు... ఇలా పూర్తి ఓరల్‌ హెల్త్‌ (Oral health) మీద దృష్టి పెట్టాలి.

దంత క్షయానికి బీజాలు బాల్యంలోనే పడిపోతూ ఉంటాయి. సాధారణంగా రాత్రి పూట పిల్లలకు చక్కెర కలిపిన పాల (Milk) ను పట్టిస్తూ ఉంటారు. దాంతో దంతాల్లో క్యావిటీలు ఏర్పడి, దంతాల్లోని పల్ప్‌ బహిర్గతమై పంటి నొప్పులు మొదలవుతాయి. నిర్లక్ష్యం చేస్తే పాల దంతాలు ముందుగానే ఊడిపోవడం లేదా కొత్త దంతాలు పుచ్చిపోవడం లాంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి రాత్రిపూట పిల్లలకు ఇచ్చే పాలల్లో చక్కెరను కలపకుండా, పాలు లేదా ఏ పదార్థాలు తిన్నా నిద్రకు ముందు దంతాలను శుభ్రపరచుకోవడం పిల్లలకు అలవాటు చేయాలి. అలాగే ఊడిన పాల దంతాల స్థానంలో శాశ్వత దంతాలు సక్రమంగా వస్తున్నాయో లేదో పెద్దలు గమనిస్తూ ఉండాలి. అలాగే పాల దంతాలు సమయానికి ఊడుతున్నాయో లేదో కూడా గమనించుకోవాలి. అలాగే శాశ్వత దంతాలు ఎగుడుదిగుడుగా వస్తున్నట్టు గమనిస్తే, వెంటనే దంత వైద్యుల చేత వాటిని బ్రేసెస్‌, క్లిప్స్‌తో సరి చేయించుకోవలసి ఉంటుంది. అలాగే దంతాల్లో క్యావిటీలను ఎప్పటికప్పుడు ఫిల్‌ చేయించడం కూడా అవసరమే!

ప్రమాదాల్లో పన్ను విరిగితే?

పిల్లలకైనా, పెద్దలకైనా ప్రమాదాల్లో పన్ను విరిగితే నిర్లక్ష్యం చేయకూడదు. డ్యామేజీ ఎనామిల్‌ స్థాయిలో కాస్మటిక్‌ కాంపోజిట్‌ ఫిల్లింగ్‌ చేయవలసి ఉంటుంది. అలా వీలుపడని పక్షంలో సెరామిక్‌ క్యాప్స్‌ లేదా జెర్కోనియం క్రౌన్స్‌ అవసరమవుతాయి. దంతం విరగడంతో పాటు లోపలున్న నాడి కూడా బహిర్గతమైతే, రూట్‌కెనాల్‌ ట్రీట్మెంట్‌ చేసి, క్యాప్స్‌ వేయవలసి ఉంటుంది. ఒకవేళ ప్రమాదంలో పన్ను ఊడితే, పాలలో వేసి వైద్యులను కలవాలి. లేదంటే శుభ్రం చేసి, నాలుక కింద ఉంచుకుని వైద్యులను కలవాలి. ఇలాంటి దంతాలను రీప్లాంట్‌ చేయవచ్చు.

దంత క్షయం మొదలైతే?

సాధారణంగా దంతాలు (teeth)పుచ్చే సమయంలో వాటిలో పదార్థాలు ఇరుక్కుపోతూ ఉంటాయి. దాంతో ఆహారం (Food) తిన్న ప్రతిసారీ టూత్‌పిక్స్‌తో వాటిని తొలగిస్తూ ఉండడం పరిపాటై పోతుంది. ఇలా చేయడం వల్ల క్యావిటీ పరిమాణం పెరిగిపోతుంది. తర్వాత ఎనామిల్‌ కోల్పోయి పల్స్‌ బహిర్గతమైన విపరీతమైన నొప్పి మొదలవుతుంది. ఇలాంటప్పుడు వైద్యులను కలవడం కంటే మొదటి దశలోనే క్యావిటీలను ఫిల్లింగ్‌ చేసుకోగలిగితే దంతాన్ని నష్టపోకుండా కాపాడుకోవచ్చు.

3.jpg

దంతాలు ఊడిపోతే?

కొందర్లో దంతాలు ఊడిపోయి, ఖాళీలు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు కట్టుడు దంతాలు బిగించడానికి వీలుగా పక్క దంతాల ఆధారం లేనప్పుడు రిమూవబుల్‌ డెంచర్స్‌ను ఆశ్రయించవచ్చు. ఇంకొందరికి పక్క దంతాలను అరగదీసి, సెరామిక్‌ లేదా జెర్కోనియమ్‌ బ్రిడ్జెస్‌ ఏర్పాటు చేయవచ్చు. పక్క దంతాలతో సంబంధం లేకుండా, ఊడిన పంటి స్థానంలో ఇంప్లాంట్‌ను అమర్చుకునే అవకాశం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది.

గారలు, ఫ్లోరోసిస్‌

పాన్‌ పరాగ్‌, గుట్కా (Gutka), ధూమపానం (Smoking)లాంటి అలవాట్లతో దంతాల మీద గార ఏర్పడుతుంది. దీన్ని ప్రతి ఆరు నెలలకోసారి క్లీన్‌ చేయించుకోవడం అవసరం. అలాగే ఫ్లోరోసిస్‌ కారణంగా ఏర్పడిన దంతాల గారను శుభ్రం చేసి, కాస్మటిక్‌ కాంపొజిట్‌ ఫిల్లింగ్‌ చేయించుకోవాలి. అలాగే బ్లీచింగ్‌ ఏజెంట్స్‌తో కూడా సమస్యను సరిదిద్దవచ్చు. కొన్ని సందర్భాల్లో లామినేట్స్‌, క్రౌన్స్‌ కూడా అవసరం పడవచ్చు. విపరీతంగా డ్యామేజ్‌ అయిన పక్షంలో రూట్‌కెనాల్‌ చేసి, క్రౌన్స్‌ అమర్చవలసి వస్తుంది. ఇంకొందరికి ఇంప్లాంట్స్‌ కూడా అవసరం పడవచ్చు.

చిగుళ్ల సమస్యలతో దంతక్షయం

కొందరు ఎంత బాగా దంతాలను శుభ్రం చేసుకున్నా నోటి దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది. కొందరికి బ్రష్‌ చేసిన ప్రతిసారీ చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అలాగే దంతాల మధ్య ఖాళీలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. చిగుళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి ఆరు నెలలకోసారి దంత వైద్యుల చేత డీప్‌ క్టీనింగ్‌ చేయించుకుంటూ ఉండాలి. చిగుళ్ల నుంచి రకస్రావమయ్యే సమస్య జింజివైటిస్‌. ఈ దశ దాటిన తర్వాత చిగుళ్లు వాచి, చీము పేరుకుంటూ ఉంటుంది. అలాగే దంతాలు కూడా వదులవుతూ ఉంటాయి. ఈ సమస్యను పెరియోడాంటైటిస్‌ అంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే దంతాల అడుగున ఉండే ఎముక అరుగుదల మొదలవుతుంది. దాంతో దంతాలు తేలికగా ఊడిపోతాయి. కాబట్టి ఈ పరిస్థిథి రాకుండా ఉండాలంటే తొలి జింజివైటిస్‌ దశలోనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఒకవేళ బోన్‌ లాస్‌తో దంతాలు వదులైపోతే ఫ్లాప్‌ సర్జరీ (Surgery)ని ఆశ్రయించవలసి ఉంటుంది. ఈ సర్జరీలో భాగంగా చిగుళ్లను తెరచి, బోన్‌ లాస్‌ అయిన ప్రదేశంలో బోన్‌ గ్రాఫ్టింగ్‌ చేస్తారు.

ప్రి కేన్సర్‌ దశలో...

పాన్‌ పరాగ్‌, గుట్కా లాంటి అలవాట్ల వల్ల ఒక దశలో నోట్లోని మ్యూకస్‌ మెంబ్రేన్లలోని ఎలాస్టిక్‌ టిష్యూ గట్టిపడి (ఓరల్‌ సబ్‌ మ్యూకస్‌ ఫ్రైబ్రోసిస్‌) నోరు తెరవలేని పరిస్థితి తలెత్తుతుంది. నోట్లో మంటతో ఎలాంటి ఆహారమూ తినలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇది నోటి కేన్సర్‌గా మారే అవకాశమున్న పరిస్థితి. అయితే ఈ దశకు చేరుకున్న వారి నోట్లో గట్టిపడిన మ్యూకస్‌ మెంబ్రేన్‌ బ్యాండ్లను బ్రేక్‌ చేయడంతో పాటు, దురలవాట్లకు దూరంగా ఉండగలిగితే, సమస్య కేన్సర్‌కు దారి తీయకుండా నిరోధించవచ్చు.

నాలుక మందబారితే?

కొందరికి నోట్లో తడి ఆరిపోతూ ఉంటుంది. నాలుక మందమై పదాలను స్పష్టంగా పలకలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు హార్మోన్‌ సమస్యలు ఉన్నాయేమో గమనించుకోవాలి. మధుమేహం లాంటి అంతఃస్రావ వ్యవస్థ సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అలాగే బిపి మందులు, యాంటీ డిప్రెసెంట్స్‌, యాంటీ సైకోటిక్‌ మందుల వల్ల కూడా నోరు తడి ఆరిపోతూ ఉంటుంది. నాలుక మందంగా మారడానికి ప్రధాన కారణం పోషక లోపం. కాబట్టి పోషకాల లోపం లేకుండా విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవాలి. బి కాంప్లెక్స్‌ లోపం వల్ల నోటి అల్సర్లు కూడా వేధిస్తాయి. కాబట్టి ఆ లోపాన్ని కూడా గమనించుకోవాలి. కొన్ని నోటి అల్సర్లు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, హెర్పిస్‌ వల్ల తలెత్తుతాయి. కాబట్టి అసలు కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.

దంతాలే లేకపోతే?

దంతాలన్నీ ఊడిపోయిన పెద్దలకు పూర్వం వైద్యులు రిమూవబుల్‌ డెంచర్లను సూచించేవారు. ఒకవేళ ఎముక దృఢంగా ఉంటే, శాశ్వత ఇంప్లాంట్స్‌ను అమర్చే విధానం ఇప్పడు అందుబాటులో ఉంది.స

2.jpg

ఈ అలవాట్లే పొరపాట్లు

  • పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు వల్ల దంతాలు, దవడల నిర్మాణంలో పొరపాట్లు చోటుచేసుకుంటాయి. కాబట్టి ఆ అలవాటును మాన్పించాలి.

  • కొంతమంది పిల్లలకు నాలుకతో దంతాలను నెట్టే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును కూడా మాన్పించాలి.

  • పాల దంతాలు సమయానికి ఊడకపోవడం వల్ల, ఆ ప్రదేశంలో వచ్చే శాశ్వత దంతాలు వంకరగా పెరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పాల దంతాలు సరైన సమయంలో ఊడిపోయేలా చూసుకోవాలి. ఇందుకోసం పిల్లలను దంత వైద్యుల చేత పరీక్ష చేయిస్తూ ఉండాలి.

  • వంకర పళ్లను సరిచేయించుకోకపోతే, భవిష్యత్తులో వాటిలో ప్లేక్‌ పేరుకుని పుచ్చిపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

ఓరల్‌ హెల్త్‌ ఇలా క్షేమం

  • పిల్లలకు చిన్నప్పటి నుంచే పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేయాలి. యాపిల్‌ లాంటి పండ్లతో దంతాలు, చిగుళ్లు శుభ్రపడతాయి.

  • క్యాల్షియం సప్లిమెంట్లతో దంతాలు దృఢంగా ఉంటాయి.

  • తీపి పదార్థాలను తగ్గించాలి. తిన్న వెంటనే దంతాలు శుభ్రం చేసుకోవాలి.

  • మెత్తని బ్రిసిల్స్‌ బ్రష్‌నే దంత ధావనానికి ఉపయోగించాలి.

  • ప్రతి మూడు నెలలకోసారి టూత్‌బ్రష్‌ను మారుస్తూ ఉండాలి.

  • ప్రతి ఆరు నెలలకోసారి దంత వైద్యుల చేత దంతాల ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి.

  • శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

  • రోజుకు రెండు సార్లు బ్రష్‌ చేసుకోవాలి.

cda.jpg

-డాక్టర్‌ కడియాల రాజేంద్ర

ఓరల్‌ అండ్‌ మ్యాక్సిలోఫేసియల్‌ సర్జన్‌,

ఎ.పి సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌

Updated Date - 2023-02-21T12:27:24+05:30 IST