కీటో డైట్‌పై అనుభవజ్ఞుడు అందిస్తున్న సూచనలు ఇవే!

ABN , First Publish Date - 2023-04-11T11:30:33+05:30 IST

ఏ డైట్‌ గురించైనా వివాదాలు, వాదనలు సర్వత్రా సహజమే! అలాగే కీటో డైట్‌ కూడా! దీంతో బరువు భలేగా తగ్గిపోవచ్చు అని కొందరంటారు. ఈ డైట్‌ మూత్రపిండాలను దెబ్బతీస్తుందని ఇంకొందరు

కీటో డైట్‌పై అనుభవజ్ఞుడు అందిస్తున్న సూచనలు ఇవే!
Keto Diet

ఏ డైట్‌ గురించైనా వివాదాలు, వాదనలు సర్వత్రా సహజమే! అలాగే కీటో డైట్‌ కూడా! దీంతో బరువు భలేగా తగ్గిపోవచ్చు అని కొందరంటారు. ఈ డైట్‌ మూత్రపిండాలను దెబ్బతీస్తుందని ఇంకొందరు భయపడతారు. నిజం తెలియాలంటే, ఈ డైట్‌ను ఐదేళ్లుగా అనుసరిస్తూ, ఎంతో మందికి మార్దనిర్దేశం చేస్తున్న దుర్గా ప్రసాద్‌ నీలకంఠి గారిని అడగాలి. వృత్తిపరంగా చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ అయినప్పటికీ, ఆరోగ్య పరిరక్షణననే ప్రవృత్తిగా మలుచుకున్న దుర్గా ప్రసాద్‌ అందిస్తున్న కీటో డైట్‌ సలహాలివి!

ఎక్కువ మంది అతి కష్టం మీద వారం రోజుల పాటు కీటో డైట్‌ చేసి, చివరకు చేతులెత్తేస్తూ ఉంటారు. కానీ దీర్ఘకాల ఆరోగ్య ఫలితాలను పొందడం కోసం ఈ డైట్‌ను జీవితంలో భాగం చేసుకోవాలంటున్నారు దుర్గా ప్రసాద్‌. ఐదేళ్ల క్రితం సైనస్‌, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు వేధించినప్పుడు, మందులకు బదులుగా ఆహారంతో రుగ్మతలను అదుపులోకి తీసుకురావాలనే సంకల్పంతో కీటో డైట్‌ను అనుసరించడం మొదలుపెట్టారు. అయితే అందుకోసం ఎవరి సలహాలు, సూచనలు పాటించకుండా సొంతంగా పరిశోధన చేసి, అనుభవజ్ఞుల పుస్తకాలు చదివి అవగాహన ఏర్పరుచుకుని, తనదైన సొంత కీటో డైట్‌ను రూపొందించుకున్న దుర్గా ప్రసాద్‌, ఐదేళ్లుగా అదే డైట్‌కు కట్టుబడి ఉండడం చెప్పుకోదగిన విశేషం.

body.jpg

రోజుకు ఒక్క భోజనమే!

70 కిలోల శరీర బరువు రెండు నెలల్లో 55కు చేరుకోవడంతో, కీళ్ల నొప్పులు, పాదాల్లో నొప్పులు, ఫ్రాక్చర్ల నొప్పులు తగ్గుముఖం పట్టాయంటున్నారాయన. మిగతా రుగ్మతలకు వాడే మందులన్నీ మొదటి వారంలోనే మానేసిన దుర్గా ప్రసాద్‌, మల్టీ విటమిన్‌, రీవైటల్‌ టాబ్లెట్‌, నెలకోసారి విటమిన్‌ ఎ, డి, ఇ, కెలను వాడుకుంటూ ఉంటున్నానని చెప్పుకొచ్చారు. అలాగే అప్పుడప్పుడూ ఐరన్‌ టాబ్లెట్లు కూడా వాడుకుంటున్నారు. అయితే ఆయన రోజు మొత్తంలో ఒక్క భోజనంతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. రోజు మొత్తానికీ ఒక్క భోజనం ఎలా సరిపోతుంది? రోజంతా ఆకలి వేయదా? అని అనుమానం రావచ్చు. కానీ రోజు మొత్తంలో తాను 80 గ్రాముల కొబ్బరినూనె, నిమ్మరసం, గ్రీన్‌ టీ తాగుతాననీ, రాత్రి భోజనంలో నాలుగు గుడ్లతో పాటు ఒక కూరగాయ కూర, నట్స్‌ తీసుకుంటున్నాని చెప్పుకొచ్చారు.

key.jpg

నా డైలీ డైట్‌ ఇదే!

ఉదయం ఏడు గంటలకు 20 గ్రాముల కొబ్బరినూనెను రెండు కప్పుల గ్రీన్‌టీ, నిమ్మరసంతో కలిపి బ్రేక్‌ఫా‌స్ట్‌గా తీసుకుంటున్నారు దుర్గా ప్రసాద్‌. తొమ్మిది గంటలకు ఒక కప్పు గ్రీన్‌టీతో 10 గ్రాముల అవిసె నూనెతో పాటు, ఇంకొక కప్పు గ్రీన్‌ టీతో 10 గ్రాముల కొబ్బరి నూనె తీసుకుంటున్నారు. అప్పటికి 40 గ్రాముల కొబ్బరినూనె తీసుకున్నట్టు అవుతుంది. ఒంటి గంటకు లంచ్‌లో మళ్లీ 20 గ్రాముల కొబ్బరినూనె తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రెండు కప్పుల గ్రీన్‌ టీలో 20 గ్రాముల కొబ్బరినూనె, నిమ్మరసం కలుపుకుని తాగితే, ఆ రోజుకి 80 గ్రాముల కొబ్బరినూనె కోటా పూర్తవుతుంది. సాయంత్రం 7 గంటలకు డిన్నర్‌ కూడా పూర్తవుతుంది. ‘స్వతహాగా శాకాహారిని అయినప్పటికీ కీటో డైట్‌లో భాగంగా ప్రొటీన్‌ తినక తప్పదు కాబట్టి గుడ్లను తినడం అలవాటు చేసుకున్నాను’ అంటున్నారాయన. కూర కోసం దోసకాయ లేదా కాలీఫ్లవర్‌ ఎంచుకుంటూ ఉంటారు. అలాగే బెండకాయ, దొండకాయ, పన్నీర్‌, మష్రూమ్స్‌ కూడా తింటూ ఉంటారు. అలాగే డిన్నర్‌లో 10 బాదం, 10 పిస్తా, 10 వాల్‌నట్స్‌, పొద్దుతిరుగుడు, గుమ్మడి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు తలా రెండు స్పూన్లు, అరుదుగా నాలుగైదు జీడిపప్పులు తీసుకుంటున్నారు. ఇక పండగ రోజుల్లో తీపి తినడం కోసం నేతిలో క్యారెట్‌ ముక్కలను వేయించి తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినా, తన డైట్‌ను, స్టవ్‌తో సహా వెంట తీసుకువెళ్తూ ఉంటారు. దుర్గా ప్రసాద్‌.

kidkd.jpg

కిడ్నీలు క్షేమమే!

కీటో డైట్‌తో కిడ్నీలు పాడవుతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు దుర్గా ప్రసాద్‌. ఈ విషయాన్ని నేను నిరూపించాలని నిశ్చయించుకుని కీటో డైట్‌ను అనుసరించాను అంటున్నారాయన. ఎలాంటి కీటో డైట్‌ అనుసరించని తన తల్లి 50 ఏళ్లలోపే కిడ్నీ ఫెయిల్యూర్‌తో చనిపోయారని చెప్తున్న ఆయన, నిజానికి కీటో డైట్‌తో అధిక రక్తపోటు వెంటనే సాధారణ స్థితికి వస్తుందనీ, దాంతో కిడ్నీల పనితీరు మెరుగుపడుతుందనీ అంటున్నారు. కీటో డైట్‌లో అధిక ప్రొటీన్‌ ఉండదు కాబట్టి ప్రొటీన్‌తో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉండదు. ఒక రోజుకు 150 గ్రాముల ప్రొటీన్‌ను భరించగలిగే స్థోమత కిడ్నీలకు ఉంటుంది. కానీ కీటోలో అంత పెద్ద మొత్తాల్లో ప్రొటీన్‌ తీసుకునే అవకాశమే ఉండదు.

కేన్సర్‌ నుంచి విముక్తి

కేన్సర్‌, ప్రధానంగా పిండిపదార్థాలతోనే అభివృద్ధి చెందుతుంది. కీటో డైట్‌లో కార్బ్స్‌ తగ్గించడంతో శరీరంలో గ్లూకోజ్‌ పరిమాణం కూడా తగ్గి, బీటా హైడ్రాక్సీ గ్లూటరేట్‌ అనే రసాయనం విడుదలవుతుంది. ఈ రసాయనం కేన్సర్‌ కణాలతో కలిసినప్పుడు, కేన్సర్‌ కణాలు చనిపోయి, వ్యాధి అదుపులోకి వస్తుందంటున్నారు దుర్గా ప్రసాద్‌. ఈ రసాయనం కీటో డైట్‌లో మాత్రమే విడుదలవుతుంది.

కొత్త కణాల పుట్టుకతో...

గ్లూకోజ్‌ మాలిక్యూల్‌ కంటే కీటోన్‌ మాలిక్యూల్‌కు నాలుగు రెట్లు శక్తి ఎక్కువ. కాబట్టే కీటో డైట్‌ను అనుసరించేవాళ్లు సాధారణ డైట్‌ తీసుకునే వాళ్ల కంటే ఎంతో చురుగ్గా ఉంటారు. అందుకోసం రోజులో తీసుకునే కొబ్బరినూనె మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ నియమాన్ని అనుసరించగలిగితే, కీటో డైట్‌తో నీరసించిపోయే ప్రమాదం ఏమాత్రం ఉండదు అంటున్నారు దుర్గా ప్రసాద్‌. అలాగే కీటో డైట్‌లో భాగంగా రోజు మొత్తంలో కార్బ్స్‌ 5ు, ప్రొటీన్‌ 20ు, ఫ్యాట్‌ 75ు తీసుకోవలసి ఉంటుంది. కొబ్బరినూనె, నెయ్యి, వెన్న.. ఇవన్నీ కొవ్వు కోవలోకే వచ్చినా కొబ్బరినూనెకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కొబ్బరినూనెలో 45ు లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. దీన్నుంచి కాలేయం, మోనోలారిన్‌ అనే రసాయనిక మూలకాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలో కొత్త కణాల సృష్టికి తోడ్పడుతుంది. కాబట్టి శరీరంలో ప్రతి రోజూ చనిపోతూ ఉండే మృత కణాల స్థానాన్ని కొత్త కణాలు భర్తీ చేస్తూ ఉండడం వల్ల వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. సాధారణంగా 40 ఏళ్ల వయసు నుంచి శరీరంలో కణాలు చనిపోతూ ఉంటాయి. కీటో డైట్‌లో కొత్త కణాలు పుడుతూ ఉంటాయి కాబట్టి ఆయుష్షు కూడా పెరుగుతుంది అంటున్నారు దుర్గా ప్రసాద్‌. నిజానికి ప్రాచీన కాలంలో రుషులు కీటో డైట్‌లోనే ఉన్నారనీ, నిజానికి ఈ కీటో డైట్‌ను చరక మహర్షి కనిపెట్టాడనీ చెప్పుకొస్తున్నారాయన.

kye.jpg

అవిసె నూనెతో గుండెకు మేలు

అవిసె నూనెలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండె రక్తనాళాల్లోని అడ్డంకులను కరిగించడానికి తోడ్పడతాయి. గుండె రక్తనాళాల్లో స్టెంట్లు వేయించుకునే అవసరం ఉన్న వాళ్లు కీటో డైట్‌లో భాగంగా అవిసె నూనెను కూడా తీసుకోగలిగితే స్టెంట్ల అవసరం పోతుంది అంటున్నారు దుర్గా ప్రసాద్‌.

లెక్కలేనన్ని పదార్థాలు

కీటో డైట్‌ అనగానే కొన్ని పదార్థాలకే పరిమితమైపోవాలనే భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. కానీ నిజానికి కీటోలో 300 రకాల తినదగిన పదార్థాలుంటాయి. అలాగే బాదం పిండితో దోశలు వేసుకోవచ్చు. కాలీఫ్లవర్‌తో బిరియాని, పులిహోర చేసుకోవచ్చు. ఉడికించిన కోడిగుడ్డులో పచ్చసొన తీసేసి, ఆ స్థానంలో కొత్తిమీర, పుదీనా, వెన్న కలిపి వండుకుని ‘డెవిల్‌ ఎగ్స్‌’ తయారుచేసుకుని తినవచ్చు. అలాగే క్యాబేజీతో రోల్స్‌ చేసుకోవచ్చు. అలాగే మసాలాలు, నిమ్మరసం లాంటి వాటిని వంటకాలకు జోడిస్తూ రుచికరంగా వండుకోవాలి.

దుష్ప్రభావాలు లేకుండా..

శరీరం ఒక మంచి మార్పుకు వెళ్లే ముందు, కొన్ని విత్‌డ్రాయల్‌ లక్షణాలు తలెత్తుతాయి. అదే కీటో డైట్‌లో జరుగుతుంది. తల తిరగడం, నీరసం లాంటి లక్షణాలు కొన్ని రోజుల పాటు వేధించడం సహజం. అయితే, డైట్‌ మీద మొహం మొత్తినప్పుడు పల్చని సూప్స్‌ తయారు చేసుకుని తాగవచ్చు. ఇలాంటి సూప్స్‌ తాగడం వల్ల కీటోన్స్‌ ఉత్పత్తికి ఆటంకం జరగకుండా ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌కు లోను కావచ్చు.

మాది మెదక్‌ జిల్లా, నారాయణ్‌ఖేడ్‌ దగ్గర ఒక కుగ్రామం. 1987లో హైదరాబాద్‌ వచ్చేశాను. ప్రస్తుతం చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాను. వీరమాచినేని రామకృష్ణ డైట్‌ శాస్త్రీయ విశ్లేషణ అనే పుస్తకంతో పాటు, కేన్సర్‌తో సహా సర్వరోగ నివారిణి కీటో డైట్‌ అనే పుస్తకం కూడా రాశాను. అలాగే ఎన్‌డిపి సిఎ కీటోన్‌ డైట్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో 400 వీడియోలు చేశాను. ఇప్పటివరకూ నేను ఇండియాలో, విదేశాల్లో కలిపి కొన్ని వేల మందికి కీటో డైట్‌లో మార్గనిర్దేశం చేశాను.

sdi.jpg

-దుర్గా ప్రసాద్‌ నీలకంఠి, చార్టర్డ్‌ అకౌంటెంట్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

(సూచన: ఐదేళ్లుగా కీటో డైట్‌ను పాటిస్తున్న దుర్గా ప్రసాద్‌ నీలకంఠి సూచనల ఆధారంగా ఈ వ్యాసాన్ని రూపొందించడం జరిగింది. కీటో డైట్‌ అనుసరించాలని అనుకున్న వాళ్లు ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచన)

Updated Date - 2023-04-11T11:30:33+05:30 IST