BRS TS election: బీఆర్ఎస్ జనగామ సభలో ఆసక్తికర పరిణామం.. ముత్తిరెడ్డికి వంగి నమస్కారం చేసిన పల్లా రాజేశ్వరెడ్డి

ABN , First Publish Date - 2023-10-11T16:02:02+05:30 IST

నిన్నమొన్నటి వరకు జనగామ సీటు కోసం పట్టుపట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మారిపోయారు. రానున్న ఎన్నికల్లో తన స్థానం నుంచి పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ కీలక నేత పల్లా రాజేశ్వరెడ్డికి సహకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ జనగామ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

BRS TS election: బీఆర్ఎస్ జనగామ సభలో ఆసక్తికర పరిణామం.. ముత్తిరెడ్డికి వంగి నమస్కారం చేసిన పల్లా రాజేశ్వరెడ్డి

జనగామ: నిన్నమొన్నటి వరకు జనగామ సీటు కోసం పట్టుపట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మారిపోయారు. రానున్న ఎన్నికల్లో తన స్థానం నుంచి పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ కీలక నేత పల్లా రాజేశ్వరెడ్డికి సహకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ జనగామ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. ముత్తిరెడ్డికి పల్లా రాజేశ్వర్ రెడ్డి వంగి నమస్కారం చేశారు. సభలో పల్లాతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేయి కలిపి పైకెత్తారు. పల్లాకు తన సహాయ, సహకారాలు ఉంటాయని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. కాగా.. కేసీఆర్ సూచన మేరకు పల్లా రాజేశ్వరరెడ్డి ఈసారి జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ముత్తిరెడ్డి బీఆర్ఎస్‌పై గుర్రుగా ఉంటూ వచ్చారు. అయితే కేటీఆర్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. సర్దిచెప్పి ముత్తిరెడ్డిని దారికి తీసుకొచ్చారు. అయితే మొన్నటి వరకూ ఉప్పు-నిప్పుగా ఉన్న నేతలు ఇప్పుడు కలిసిపోవడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. కాగా వీళ్లిద్దరి మధ్య సయోధ్య కుదర్చడంలో మంత్రి కేటీఆర్ సక్సెస్ అయ్యారు.


కాగా.. జనగామలో బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్గీయులు, పల్లా రాజేశ్వర్రెడ్డి వర్గీయులు అంతా కలిసి పనిచేయాలని సూచించారు. ముత్తిరెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చి కేసీఆర్ గౌరవం ఇచ్చారని గుర్తుచేశారు. ఇకపై విభేదాలు సృష్టించి గొడవలు చేస్తే కేసీఆర్‌కు ద్రోహం చేసినట్టేనని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు సరిగా లేవని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు దొంగ సర్వేలు చేసి గెలుస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. దగ్గరకు వచ్చే నేతలను నిలదీయాలని అన్నారు.

Updated Date - 2023-10-11T16:02:02+05:30 IST