Karnatka Elections: మోదీ..మోదీ.. నినాదాలతో హోరెత్తిన రోడ్‌షో

ABN , First Publish Date - 2023-05-07T17:28:30+05:30 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరి కొద్ది గంటలలోనే ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు బెంగళూరు సిటీలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రజలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు. మోదీ...మోదీ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా రోడ్‌షోలో పాల్గొన్నారు

Karnatka Elections: మోదీ..మోదీ.. నినాదాలతో హోరెత్తిన రోడ్‌షో

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారం మరి కొద్ది గంటల్లోనే ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బెంగళూరు సిటీలో భారీ రోడ్‌షోలో (Roadshow) పాల్గొన్నారు. ప్రజలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు. మోదీ...మోదీ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా రోడ్‌షోలో పాల్గొన్నారు. తిప్పసండ్ర రోడ్డులోని కెంపెగౌడ విగ్రం నుంచి ప్రారంభమైన రోడ్‌షో ట్రినిటీ రోడ్‌ వద్ద ముగిసింది. గంటన్నర వ్యవధిలో 8 కిలోమీటర్ల మేరకు రోడ్‌షో జరిగింది.

తొలుత, బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఈస్ట్, సెంట్రల్ బెంగళూరులోని సుమారు అరడజను అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రోడ్‌షా సాగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనంలో మోదీ ఈ యాత్ర సాగించారు. ఆయన వెంట కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ కూడా వాహనంలో ప్రయాణించారు. రోడ్లపైన, భవనాలపైన పెద్దసంఖ్యలో గుమిగూడిన ప్రజానీకానికి మోదీ అభివాదం చేయడంతో, అందుకు ప్రతిగా వారు...మోదీ మోదీ, భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో వాయిద్యాలు మోగిస్తూ పండుగ వాతావరణం కనిపించింది. మెల్లగా ప్రయాణిస్తూ ముందుకు సాగిన మోదీపైన, ఆయన వాహన శ్రేణిపైన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పుష్పవర్షం కురిపించారు. ట్రినిటీ సర్కిల్‌కు రోడ్‌షో చేరుకోగానే మోదీ ముకుళిత హస్తాలతో ప్రజలకు అభివాదం చేశారు. మోదీ రోడ్‌షో సందర్భంగా పలు చోట్లు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఈనెల 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, ఈనెల 8వ తేదీ సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈనెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-05-07T21:30:46+05:30 IST