Teacher posts: మెగా డీఎస్సీ పోయి.. మినీ డీఎస్సీ వచ్చె!

ABN , First Publish Date - 2023-09-06T09:36:25+05:30 IST

ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నందున.. ప్రభుత్వం మెగా డీఎస్సీ (DSC) వేస్తుందని భావించిన ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లింది.

Teacher posts: మెగా డీఎస్సీ పోయి.. మినీ డీఎస్సీ వచ్చె!

రాష్ట్రంలో 19 వేల దాకా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు’

6612 పోస్టుల భర్తీకే సర్కారు ఉత్తర్వులు

ఖాళీలన్నీ భర్తీ చేయాలంటున్న నిరుద్యోగులు

విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ల నియామకాలు!

ప్రభుత్వ స్కూళ్లలో భారీగా తగ్గిన ప్రవేశాలు

జీరో అడ్మిషన్లతో 1290 బడుల మూసివేత!

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నందున.. ప్రభుత్వం మెగా డీఎస్సీ (DSC) వేస్తుందని భావించిన ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల్లో సగం పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. దీంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే పోస్టులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. ఇటీవలే ప్రభుత్వం 6,612 టీచర్‌ పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిలో పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఫర్‌ డిజేబుల్డ్‌లో మరో 1,523 పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీని టీఎస్‌పీఎస్సీ(TSPSC) ద్వారా కాకుండా డిస్ట్రిక్ట్‌ సెలెక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, అదనపు కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా, డీఈవో సెక్రటరీగా, జిల్లా పరిషత్‌ సీఈవో సభ్యుడిగా ఉంటారు. ప్రతి జిల్లాలో ఆయా జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. అయితే రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులకు అనుగుణంగా భర్తీ చేపట్టకపోవడాన్ని నిరుద్యోగులు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం భర్తీ చేయాలని నిర్ణయించిన పోస్టులు పోను.. ఇంకా 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటు నిరుద్యోగులతోపాటు అటు ఉపాధ్యాయల సంఘాల ప్రతినిధులూ చెబుతున్నారు. మొత్తం పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పదోన్నతుల ద్వారా మరిన్ని పోస్టులు ఖాళీ..

రాష్ట్రంలో మొత్తం 1,22,389 టీచర్‌ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 1,03,343 మంది టీచర్లు పని చేస్తున్నారు. అంటే.. సుమారు 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా వేయాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా 1,947, పీఎస్‌ హెచ్‌ఎంలుగా 2,162, స్కూల్‌ అసిస్టెంట్లుగా 5,870 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు బదిలీల షెడ్యూల్‌ను కూడా జారీ చేసింది. అయితే పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే పోస్టుల భర్తీని తర్వాత చేపడతామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే పోస్టులనూ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయి. కానీ, గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన స్థాయిలో కూడా టీచర్‌ పోస్టులను భర్తీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో భాగంగా టీచర్‌ పోస్టులను కూడా భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ 2022 మార్చి 9న అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సెకండరీ ఎడ్యుకేషన్‌లో ఖాళీగా ఉన్న 13,086 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. కానీ, ప్రస్తుతం వాటిలో సగం పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి చెప్పిన సంఖ్యలో కూడా పోస్టులను భర్తీ చేయడం లేదు.

6 వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడే

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 వేల పాఠశాలలు ఉండగా.. వీటిలో 18,235 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కాగా, ఇందులో 1,290 పాఠశాలల్లో ఈ ఏడాది జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. దీంతో ఈ స్కూళ్లను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. సుమారు 6 వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 30 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్నారు. 1-5 తరగతులకు ఈ స్కూళ్లలో బోధిస్తారు. ఏ రోజైనా ఈ స్కూల్‌ టీచర్‌ సెలవు పెడితే.. అదే కాంపౌండ్‌లోని ఇతర స్కూల్‌ టీచర్‌ ఇక్కడికి వచ్చి చదువు చెబుతారు. ఒకవేళ ఈ స్కూలు విడిగా ఉంటే.. దగ్గర్లోని ఉన్నత పాఠశాలల్లోని టీచర్‌ ఈ బాధ్యతలు తీసుకుంటారు. ఇక రాష్ట్రంలో ఇద్దరు టీచర్లు ఉన్న స్కూళ్లు 10,271 ఉన్నాయి. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 60 లక్షల మంది ఉంటారు. ఇందులో 47 శాతం మంది విద్యార్థులు వివధ ప్రభుత్వ స్కూళ్లల్లో ఉన్నారు.

విద్యా వలంటీర్ల స్థానంలో లేని నియామకాలు..

కరోనా సంక్షోభం కన్నా ముందు రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో సుమారు 12 వేల మంది విద్యా వలంటీర్లు పనిచేసేవారు. కరోనా సమయంలో పాఠశాలలు మూసివేసి, తిరిగి తెరిచిన తర్వాత ఈ వలంటీర్లను మళ్లీ విధుల్లోకి తీసుకోలేదు. అంటే.. ఈ మేరకు టీచర్‌ పోస్టుల ఖాళీగా ఉన్న విషయం స్పష్టమవుతోందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం తొలిసారిగా 2017లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అప్పటివరకు డీఎస్సీగా ఉన్న పేరును టీఆర్టీ (ఉపాధ్యాయ నియామక పరీక్ష)గా మార్పు చేసి, 2017 అక్టోబరు 21న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీఎ్‌సపీఎస్సీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టి 13,500 పోస్టుల నియమకాలు జరిపింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. అయితే.. ప్రస్తుత పోస్టుల సంఖ్యను బట్టి చూస్తే విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పలు పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. ముఖ్యంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య తుగ్గుతోంది. దాంతో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంత మంది ఉపాద్యాయులు ఉండాలన్న అంచనాతోనే ప్రస్తుతం టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు అర్థమవుతోంది. కానీ, ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు. అంతర్గత రేషనలైజేషన్‌ నిర్వహించి ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

KJS.jpg

Updated Date - 2023-09-06T09:36:25+05:30 IST