Postal Jobs: టెన్త్ మెరిట్‌తో కొలువులు! 4 గంటలే డ్యూటీ

ABN , First Publish Date - 2023-08-04T11:59:56+05:30 IST

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిల్స్‌లో 30,041 గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన(షెడ్యూల్‌-2, జూలై 2023) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో

Postal Jobs: టెన్త్ మెరిట్‌తో కొలువులు! 4 గంటలే డ్యూటీ

ఏపీలో 1058

టీఎస్‌లో 961

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిల్స్‌లో 30,041 గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన(షెడ్యూల్‌-2, జూలై 2023) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి పదివేల నుంచి పన్నెండువేల రూపాయలు ప్రారంభ వేతనంగా అందుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • ఆంధ్రప్రదేశ్‌లో 1058, తెలంగాణలో 961 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం / డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్‌ ఆధారపడి ఉంటుంది. రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ఫోన్‌ లాంటివి తపాలాశాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి.

ఖాళీలు: గ్రామీణ డాక్‌ సేవక్స్‌ - బ్రాంచి పోస్టుమాస్టర్‌/ అసిస్టెంట్‌ బ్రాంచి పోస్టుమాస్టర్‌/ డాక్‌ సేవక్‌: 30,041 పోస్టులు

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మేథ్స్‌, ఇంగ్లీష్‌, స్థానికభాష ఉండటం తప్పనిసరి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

వయసు: 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

జీతభత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

ఎంపిక: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆన్షన్‌ 1, తరవాత దానికి ఆప్షన్‌ 2 ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ ఇస్తారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఇమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జండర్‌లకు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు వంద రూపాయలు చెల్లించాలి.

బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచి కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ ట్రాన్షాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణి జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలు చక్కబెట్టాలి. టీమ్‌ లీడర్‌గా సంబంధిత బ్రాంచిని నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.

అసిస్టెంట్‌ బ్రాంచి పోస్టుమాస్టర్‌(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవారు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల పంపిణి జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకు సంబంధించిన డిపాజిట్స్‌, పేమెంట్స్‌, ఇతర లావాదేవీలను చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులను పూర్తిచేయాలి. వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి.

డాక్‌ సేవక్‌: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలను పంపిణి చేయాలి. స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం నిర్దేశించిన పనులను పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్‌, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు విధులను చూసుకోవాలి. పోస్టల్‌ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 3

ఆన్‌లైన్‌ దరఖాస్తులు చివరితేదీ: ఆగస్టు 23

దరఖాస్తు సవరణలకు అవకాశం: ఆగస్టు 24 నుంచి 26 వరకు

వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in/

Updated Date - 2023-08-04T11:59:56+05:30 IST