Nurse posts: నర్సు పోస్టులు పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు! ఖాళీలెన్నంటే..!
ABN , First Publish Date - 2023-06-24T11:45:04+05:30 IST
వైద్య ఆరోగ్యశాఖలో మరో 1,827 స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ కూడా వైద్యవిద్య సంచాలకుల పరిధిలోనివే. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుంది.
మరో 1827 స్టాఫ్ నర్సు పోస్టులు!
ఆర్థికశాఖ అనుమతులతో కూడిన ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో మరో 1,827 స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ కూడా వైద్యవిద్య సంచాలకుల పరిధిలోనివే. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుంది. ఇప్పటికే 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు నిరుడు డిసెంబరు 30 మెడికల్ బోర్డ్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు సంబంధించి రాత పరీక్ష ఈ ఏడాది ఆగస్టు 2న నిర్వహించబోతున్నారు. ఈ లోగానే మరో 1,827 స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మరి..ఈ కొత్త పోస్టులకు వేరే నోటిఫికేషన్ ఇస్తారా? లేక ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌లో పోస్టులను పెంచిచూపుతారా అన్న దానిపై స్పష్టత రావాల్సివుంది. ఈ కొత్త పోస్టులను కలిపితే అప్పుడు మొత్తం 7,031 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయవచ్చు. ఈ కొత్త పోస్టులను కూడా ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ పోస్టుల్లో కలపి చూపించాలంటే మెడికల్ బోర్డుకు ప్రభుత్వం అనుమతినివ్వాల్సివుంటుందని వైద్యవర్గాలు వెల్లడించాయి.
మరోవైపు నర్సింగ్ అభ్యర్ధులు కూడా కొత్తగా మంజూరైన 1,827 స్టాఫ్‌నర్స్ పోస్టులను కూడా ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌లో చేర్చాలని కోరుతున్నారు. లేకుంటే మళ్లీ దానికొక ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తే... మరోమారు పరీక్ష రాయాల్సివుంటుందని అంటున్నారు. ప్రస్తుతం 5,204 పోస్టుల రాత పరీక్ష ముగిసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు తక్కువని, అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కష్టమని నర్సింగ్ అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌లో కొత్త పోస్టులను కూడా కలపాలని సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్‌లోని 5,204 పోస్టులకు 40,926 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి కూడా కలిపితే ఒక్కో పోస్టుకు 5.8 మంది పోటీ పడనున్నారు. ఆగస్టు 2న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో రాత పరీక్ష జరగనుంది. వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఫలితాల తర్వాత 1:2 పద్ధతిలో అభ్యర్థులను పిలిచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసే అవకాశాలున్నాయి. అనంతరం ఆగస్టు చివరి నాటికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను మెడికల్ బోర్డు వైద్య ఆరోగ్యశాఖకు పంపుతుంది. ఆ జాబితా ప్రకారం జోనల్ వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇస్తారు.
కొత్త పోస్టులతో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు: హరీశ్
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అవుతుండటంతో పాటు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య చేరువవుతున్నదన్నారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నదన్నారు. దీంతో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పోస్టు చేశారు.