Share News

Encounter: మరో నెల రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ పెళ్లి.. కానీ ఇంతలోనే..

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:41 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో పెను విషాదం చోటుచేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన పోలీస్ కానిస్టేబుల్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఓ కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సదరు కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు.

Encounter: మరో నెల రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ పెళ్లి.. కానీ ఇంతలోనే..

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో పెను విషాదం చోటుచేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన పోలీస్ కానిస్టేబుల్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఓ కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సదరు కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 30 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ సచిన్ రాఠీ మరో ముగ్గురు పోలీసులతో కలిసి సోమవారం అశోక్ యాదవ్ అనే నేరస్థుడిని పట్టుకోవడానికి వెళ్లారు. 20 హత్యా కేసుల్లో నిందితుడైన అశోక్ యాదవ్‌ను అరెస్ట్ చేయడానికి కన్నౌజ్‌లోని అతని ఇంటి వద్దకు చేరుకున్నారు.


కానీ అశోక్ యాదవ్, అతని కుమారుడు అభయ్ పోలీసులపైకి ఎదురు తిరిగారు. వారిపై కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సచిన్ రాఠీ తొడపై కాల్చారు. దీంతో కొద్దిసేపటికే పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. కనీసం నాలుగు పోలీసు స్టేషన్ల నుంచి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో దాదాపు గంటపాటు ఇరువైపుల కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నిందితులు అశోక్ యాదవ్, అభయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్‌ సచిన్ రాఠిని లక్నోలోని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యువ పోలీసు చాలా రక్తాన్ని కోల్పోయాడు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. కాగా ముజఫర్‌నగర్‌కు చెందిన సచిన్ రాఠి 2019లో పోలీసు శాఖలో చేరారు. ఫిబ్రవరి 5న మహిళా కానిస్టేబుల్‌తో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేడుకలకు సిద్ధమవ్వాల్సిన వారి కుటుంబం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 02:15 PM