Crime: కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీసిన కసాయి భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ABN , First Publish Date - 2023-09-07T21:55:21+05:30 IST
మధ్యప్రదేశ్‌లో కట్నం కోసం కట్టుకున్న భార్యను బావిలో వేలాడదీశాడు ఓ కసాయి భర్త. ఆమెను తాడుతో కట్టి నీళ్లు ఉన్న బావిలోకి వేలాడదీశాడు.

భోపాల్: ఆధునిక యుగంలోనూ మహిళలకు వర కట్న వేధింపులు తప్పడం లేదు. కట్టుకున్న భార్యను నిండు నూరేళ్లు కంటికి రెప్పలా చూసుకుంటామని పెళ్లి సమయంలో ఆమె తల్లిదండ్రులకు మాట ఇచ్చిన భర్తలు ఇంతలోనే దారుణంగా వ్యవహరిస్తున్నారు. పెళ్లి సమయంలో తీసుకున్న కట్నం సరిపోలేదన్నట్టు అదనపు కట్నం కోసం భార్యలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా ఏదో ఒక సందర్భంలో బయటికొస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కట్నం కోసం కట్టుకున్న భార్యను బావిలో వేలాడదీశాడు ఓ కసాయి భర్త. ఆమెను తాడుతో కట్టి నీళ్లు ఉన్న బావిలోకి వేలాడదీశాడు. దీంతో ఆమె ప్రాణ భయంతో విలవిలలాడింది. మనసును కలిచి వేసే ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఆగష్టు 20న జరిగింది. నీముచ్‌లో నివాసం ఉండే రాకేష్ కిర్‌కు ఉషతో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. అయితే రాకేష్ కిర్ కొన్ని రోజులుగా తన భార్య ఉషను రూ.5 లక్షల కట్నం కోసం వేదిస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్యను తాడుతో కట్టి బావిలో వేలాడదీశాడు. అంతటితో ఆగకుండా భార్యను బావిలో వేలాడదీసిన ఘటనను రికార్డు చేశాడు. ఆ వీడియోను భార్య బంధువులకు పంపించాడు. దీంతో వారు గ్రామస్థుల సాయంతో ఉషను రక్షించారు. ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్‌ను అరెస్ట్ చేశారు.