YCP MLA Gopireddy: నందమూరి బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కౌంటర్

ABN , First Publish Date - 2023-03-15T21:09:45+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA), హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి (YCP MLA Gopireddy) కౌంటర్ ఇచ్చారు.

YCP MLA Gopireddy: నందమూరి బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కౌంటర్

నరసరావుపేట: టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA), హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి (YCP MLA Gopireddy) కౌంటర్ ఇచ్చారు. తాగుబోతులను వెనకేసుకొచ్చి తమ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని గోపిరెడ్డి సూచించారు. ఇక్కడైనా.. ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే గోపిరెడ్డి సవాల్ చేశారు. అసలు తమ విషయంలో తలదూర్చడానికి తమరెవరూ? అంటూ బాలకృష్ణను గోపిరెడ్డి ప్రశ్నించారు. తమరు సినిమా యాక్టర్ అయితే ఎవడికి గొప్ప?, ముందు విషయాలు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి మండిపడ్డారు. ఏదో ఊహించుకొని బాలకృష్ణ ఎక్కువ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు జిల్లా (Palnadu District) నరసరావుపేట ఎమ్మెల్యే (Narasaraopet MLA) గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి (Gopireddy Srinivasa Reddy) టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వార్నింగ్ (Balakrishna Warning) ఇచ్చారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో తన సినిమా పాటలు (Balakrishna Song) తొలగించాలని ఓ ప్రజాప్రతినిధి చెప్పడం సరికాదని, రాజకీయాలకు, సినిమాలకు ముడిపెట్టొద్దని బాలకృష్ణ హితవు పలికారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, మరోసారి ఇటువంటి ఘటన జరిగితే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జాగ్రత్త.. హెచ్చరిస్తున్నా.. చిటిక వేస్తే చాలు.. నేను మూడో కన్ను తెరిస్తే’ అని బాలయ్య మాస్ వార్నింగ్ ఇవ్వడంతో అక్కడున్న ఆయన అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు.

‘‘టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పాట పెడతావా? ఆయన పాటకు స్టెప్పులేస్తావా? నీకెంత ధైర్యం’’ అంటూ వైసీపీ కార్యకర్తపై ఆ పార్టీ నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కన్నెర్ర చేశారు. తీవ్రస్థాయిలో మందలించి వార్నింగ్‌ ఇచ్చారు. సదరు కార్యకర్త మనస్తాపానికి గురై ఎమ్మెల్యే ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పట్టణంలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ల కోసం ప్రభను రూపొందించారు. ప్రభ నిర్మాణానికి పార్టీలకతీతంగా భక్తులు విరాళాలు ఇచ్చారు. ప్రభ వద్ద డాన్స్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ హీరో బాలకృష్ణ పాటలు పెట్టి డాన్స్‌ చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన గోపిరెడ్డి.. భాస్కరరెడ్డిని మందలించడంతో పాటు హెచ్చరించారని కార్యకర్తలు తెలిపారు.

మనస్తాపానికి గురైన భాస్కరరెడ్డి ఎమ్మెల్యే ఇంటివద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. అక్కడే ఉన్న పోలీసులు, కార్యకర్తలు భాస్కరరెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు భాస్కరరెడ్డిని ఇంటికి తరలించారు. భాస్కరరెడ్డి తన ఇంటి వద్ద ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేను నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు. తాను టీడీపీ పాటలు ప్రదర్శించలేదని, సినిమా పాటలే పెట్టానని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. ఎమ్మెల్యే తనను తప్పు పట్టడంవల్లే మనస్తాపం చెందినట్టు వివరించారు.

Updated Date - 2023-03-15T21:31:36+05:30 IST