Pawan Kalyan: మార్పుకోసం పంతం పట్టి కొనసాగుతున్నా..

ABN , First Publish Date - 2023-06-26T14:08:10+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. మార్పుకోసం పంతం పట్టి కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.

Pawan Kalyan: మార్పుకోసం పంతం పట్టి కొనసాగుతున్నా..

ప.గో.జిల్లా: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోమవారం పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. మార్పుకోసం పంతం పట్టి కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. సమాజంలో విద్య (Education), వైద్యం (Medical), ఉపాధి (Employment) మూడు కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోయాయని, మిగతా వాళ్ళు దేహీ అనే పరిస్థితిలో ఉండకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించానని తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ (Sand Mining) జరుగుతోందని, ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆక్వా వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నియంత్రించడమే తమ లక్ష్యమన్నారు. ఆక్వా కాలుష్యం వల్ల ఆరోగ్యం అనేది పెద్ద సమస్యగా మారుతోందని, గోదావరి జిల్లాలో కేరళ తరహా టూరిజం అభివృద్ధికి అవకాశం ఉందని.. కానీ పెట్టుబడి పెట్టేవారు లేరన్నారు. ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటివాళ్ళు వ్యాపారాలు చేస్తూ తమ స్వార్థం చూసుకుంటున్నారని విమర్శించారు. గోదావరి మీద ఆనకట్ట కట్టాలని కాటన్ ఒక్కడు పూనుకుని పని పూర్తి చేయగలిగారని కొనియాడారు.

రాష్ట్రం కోసం.. ఇక్కడి ప్రజల కోసం కొంతమంది ముందుకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. పదవులకోసం పార్టీని తాకట్టు పెట్టలేమన్నారు. రాజకీయాలంటే ఎంతసేపు బూతులు తిట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడంగా మార్చేశారని, అందరి దృష్టి, దిష్టి గోదావరి జిల్లాలపైన పడిందని, దీని నుంచి విముక్తి కల్పించేందుకు గోదావరి జిల్లాల నుంచి పోరాటం మొదలు పెట్టానని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదనే లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. ముఖ్యమంత్రి 18 ఏళ్ల వయసులో చేసిన అరాచకాలను ఆదర్శంగా తీసుకుని ఇప్పటి వైసీపీ నాయకుల పిల్లలు డీఎస్పీ, ఎస్పీలను కొడుతున్నారని, ఎదుటి వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మనం నోరు ఎత్తకపోతే.. మనకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు రారని పవన్ కల్యాణ్ అన్నారు.

Updated Date - 2023-06-26T14:08:10+05:30 IST