G20 Summit: జీ-20 సదస్సు కోసం మురికివాడలకు పరదా ముసుగులు..

ABN , First Publish Date - 2023-03-28T02:13:50+05:30 IST

విశాఖ వేదికగా మంగళవారం నుంచి జీ-20 సదస్సు ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనేందుకు జీ-20లోని 20 సభ్యదేశాలతోపాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వస్తున్నారు.

G20 Summit: జీ-20 సదస్సు కోసం మురికివాడలకు పరదా ముసుగులు..

విశాఖపట్నం, మార్చి 27 (ఆంధజ్యోతి): విశాఖ (Visakhapatnam) వేదికగా మంగళవారం నుంచి జీ-20 సదస్సు (G-20 summit) ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనేందుకు జీ-20లోని 20 సభ్యదేశాలతోపాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు దాదాపు రూ.120 కోట్లతో నగరంలో అభివృద్ధి, సుందరీకరణ, విద్యుత్‌ అలంకరణ పనులు చేపట్టారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలను మాత్రం సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధుల కంటపడకుండా అధికారులు పరదాలు కట్టడం చర్చనీయాంశమైంది. విదేశీ ప్రతినిధులు ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి వచ్చే సమయంలో, తిరిగి వెళ్లేప్పుడు జాతీయ రహదారిని ఆనుకుని తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లోని మురికివాడలు.. వారి కంటపడకుండా ఇళ్లకు ముందు పరదాలను క ట్టేస్తున్నారు.

Untitled-6.jpg

కాగా ఈ సదస్సు మంగళ, బుధవారాల్లో సాగర్‌నగర్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్లో (Radisson blu) జరుగనుంది. వివిధ దేశాలకు చెందిన 63 మంది ప్రతినిధులను ఆహ్వానించగా.. వారిలో 57 మంది హాజరవుతున్నారు. ‘రేపటి నగరాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి?’ అనే అంశంపై సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. పట్టణీకరణలో సాధించిన విజయాలనువివిధ దేశాల ప్రతినిధులు వివరిస్తారు. మంగళవారం సీఎం జగన్‌ వీరందరికి హోటల్‌లోనే డిన్నర్‌ ఇస్తారు. అక్కడా పలు అంశాలపై చర్చిస్తారు. 29న మరో 4 అంశాలపై చర్చలుంటాయి. 30న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐఎంఎఫ్‌ తదితర సంస్థలను సదస్సుకు ఆహ్వానించారు. సింగపూర్‌, దక్షిణ కొరియా ప్రతినిధులు పట్టణీకరణలో సాధించిన విజయాలను వివరిస్తారు. ఈ చర్చల సారాన్ని 31న దేశంలోని మేయర్లు, కమిషనర్లకు వివరిస్తారు.

Untitled-3.jpg

Updated Date - 2023-03-28T18:25:30+05:30 IST