Rushikonda: కొండను తవ్విన ప్రదేశంలో ఆకుపచ్చ రంగు ఉన్న మెష్‌ ఎందుకు ఏర్పాటు చేశారంటే..

ABN , First Publish Date - 2023-02-07T01:32:20+05:30 IST

రుషికొండపై పర్యావరణ విధ్వంసం పరిశీలనకు వచ్చే కేంద్ర కమిటీ సభ్యులను ఏమర్చే యత్నాలు గట్టిగా జరుగుతున్నాయి.

Rushikonda: కొండను తవ్విన ప్రదేశంలో ఆకుపచ్చ రంగు ఉన్న మెష్‌ ఎందుకు ఏర్పాటు చేశారంటే..

హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలనకు రానున్న నేపథ్యంలో ‘జియో మ్యాటింగ్‌’?

కొండను తవ్విన ప్రదేశంలో ఆకుపచ్చ రంగు ఉన్న మెష్‌ ఏర్పాటు

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి):

రుషికొండపై (Rushikonda) పర్యావరణ విధ్వంసం పరిశీలనకు వచ్చే కేంద్ర కమిటీ సభ్యులను ఏమర్చే యత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. హరిత రిసార్ట్స్‌ పునర్మిర్మాణం పేరుతో రుషికొండపై గత రెండేళ్లుగా పనులు సాగుతున్నాయి. ఇందుకోసం రుషికొండను ఇష్టానుసారం తవ్వేసి, బోడిగుండు చేసిసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని, అనుమతించిన విస్తీర్ణానికి మించి కొండను తవ్వేశారంటూ ఆధారాలతో సహా కొంతమంది హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ వాదనలన్నీ తప్పు అని, నిబంధనల మేరకే పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. దీనికి సంతృప్తి చెందని హైకోర్టు..వాస్తవాలు ఏమిటో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఒక కమిటీని వేయాలని సూచించింది.

రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులతో కమిటీని వేయడంతో ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాష్ట్ర అధికారుల కమిటీ వల్ల వాస్తవాలు వెలుగుచూడవని, వారిని తప్పించాలని హైకోర్టును కోరాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఏడుగురు సభ్యులతో హైకోర్టు కమిటీని వేసింది. ఆరు వారాల్లోగా విశాఖలో రుషికొండను సందర్శించి, అక్కడ ఏమి జరుగుతున్నదో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఆ కమిటీకి ఇచ్చిన గడువు జనవరి 31వ తేదీతో ముగిసింది. ఇంతవరకు పర్యటనకు రాని కమిటీ.. మరో నెల రోజులు గడువు కావాలని కోరింది. కానీ హైకోర్టు దానికి నిరాకరించి రెండు వారాలే సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో ఆ కమిటీ ఇక్కడకు వచ్చి రుషికొండను పరిశీలించే అవకాశం ఉంది. కమిటీ చేసిన జాప్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పూర్తయిన కొన్ని భవనాలకు తెల్ల సున్నం వేసేసింది. ఇప్పుడు కమిటీ సందర్శిస్తే తవ్వేసిన కొండ అంతా బోడిగా కనిపిస్తుందని, దానిని కవర్‌ చేసేందుకు ‘జియో మ్యాటింగ్‌’ పనులు చేపట్టింది.

కొండ చరియలు జారిపోకుండా ఉండేందుకు, మళ్లీ ఆ ప్రాంతంలో మొక్కలు మొలిచేందుకు ఈ మ్యాటింగ్‌ ఉపయోగపడుతుందని ఏపీటీడీసీ అధికారులు చెబుతున్నారు. అయితే వారం రోజుల క్రితం ఈ పనులు ప్రారంభించినప్పుడు తొలుత సిల్వర్‌ కలర్‌ మ్యాటింగ్‌ వేశారు. ఇది కొద్దిరోజులకే నల్లగా మారిపోవడంతో అధికారులు మరో కలర్‌ మ్యాట్‌ కోసం యత్నించారు. మార్కెట్‌లో గ్రీన్‌ కలర్‌ మ్యాట్‌ లభించడంతో దానిని తీసుకువచ్చి, బోడి చేసిన కొండ చుట్టూ రివిటింగ్‌ చేస్తున్నారు. దూరం నుంచి చూసే వారికి కొండ మొత్తం పచ్చగా కనిపిస్తోంది. తవ్విన ఆనవాళ్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ హైకోర్టులో కొండపై తొలగించిన మొక్కలను తిరిగి నాటామని చెబుతూ, ఇక్కడ లేని పచ్చదనం చూపించడానికి ‘జియో మ్యాటింగ్‌’ చేయడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-02-07T11:32:34+05:30 IST