Bonda Uma: వివేకా హంతకుడిని పోలీసులు కాపాడటమా?.. ఇంతకన్నా..

ABN , First Publish Date - 2023-05-22T09:56:47+05:30 IST

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు ఎస్పీ సహకరించడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bonda Uma: వివేకా హంతకుడిని పోలీసులు కాపాడటమా?.. ఇంతకన్నా..

అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Case) సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) అరెస్ట్‌కు ఎస్పీ సహకరించడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా (TDP Leader Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లి ఆదేశాలు ఎస్పీ పాటిస్తున్నారని ఆరోపించారు. పులివెందుల కిరాయి మూకల అధీనంలో కర్నూలు హాస్పటల్ ఉందంటే ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హంతకుడిని పోలీసులు కాపాడటమా ఏపీ పోలీసుల‌కు ఇంత కన్నా అవమానం లేదని వ్యాఖ్యలు చేశారు. డీజీపీ, డీఐజీ వెంటనే కలగజేసుకోవాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డిని సీబీఐకు అప్పజెప్పలాన్నారు. తల్లి అనారోగ్యం నిజమైతే అవినాష్ తల్లిని హైదరాబాద్ అపోలో లాంటి హాస్పటల్‌కు తీసుకెళతారని.. కర్నూలులో చేర్చరని బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు.

కాగా.. నాలుగు రోజులుగా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తల్లి శ్రీలక్ష్మి దగ్గరే అవినాష్ ఉన్నారు. అయితే 19న విచారణకు హాజరుకాకపోవడం, 22న ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు రావాల్సిందేనని సీబీఐ నోటీసులు ఇవ్వడం.. ఇప్పట్లో రాలేనని సీబీఐకు అవినాష్ లేఖ రాయడం ఇలా నాలుగు రోజులుగా పెద్ద హైడ్రామానే జరుగుతోంది. అయితే.. ఆదివారం నాడు మరో పదిరోజులు సమయం కావాలని అవినాష్ గడువు కోరడంతో పదే పదే ఎందుకిలా చేస్తున్నారని.. అయితే ఆస్పత్రిలోనే విచారణ లేకుంటే అరెస్ట్ చేయడానికి సీబీఐ ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో విశ్వభారతి ఆస్పత్రి దగ్గరికి సీబీఐ అధికారులే చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఓవైపు.. ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించగా.. పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు, అవినాష్ అనుచరులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని వైసీపీలో టెన్షన్ మొదలైంది.

Updated Date - 2023-05-22T10:06:39+05:30 IST