Anam: అనుచరులతో ఆనం భేటీ.. అధిష్టానం పిలిచినా నాకు ఆ అవసరం లేదంటూ..

ABN , First Publish Date - 2023-02-02T15:45:34+05:30 IST

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వం మధ్య దూరం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Anam: అనుచరులతో ఆనం భేటీ.. అధిష్టానం పిలిచినా నాకు ఆ అవసరం లేదంటూ..

నెల్లూరు: వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Venkatagiri MLA AnamRamanarayana Reddy), వైసీపీ అధిష్టానం (YCP) మధ్య దూరం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం (YCP Government)పై పలుమార్లు విమర్శలు చేసినందుకు గాను ఆయనపై వైసీపీ అధినేత వేటు వేసిన విషయం తెలిసిందే. వెంకటగిరి నియోజకవర్గ (Venkatagiri Constituency) బాధ్యతల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం(Anam)ను తప్పించి ఆ పదవిని నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి (Nedurumalli Ramkumar Reddy)కి అధిష్టానం అప్పగించింది. అప్పటి నుంచి మౌనం వహించిన ఆనం తాజాగా అనుచరులతో సమావేశమయ్యారు. మరో రెండు నెలల్లో మహత్కర కార్యక్రమానికి శ్రీకారం చూడదామని... అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వెంకటగిరి టీడీపీకి చాలా బలమైన నియోజకవర్గమని... టీడీపీ (TDP)నే చాలాసార్లు గెలిచిందని చెప్పుకొచ్చారు. వెంకటగిరి మునిసిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఎంతో కష్టపడితే, కేవలం రెండు వేల ఓట్లు మెజారిటీ మాత్రమే వచ్చిందని ఆయన తెలిపారు.

వెంకటగిరిలో అసంతృప్తి ప్రారంభమైందన్నారు. ‘‘నన్ను అధిష్టానం నుండి పిలిచే వారు లేరు.. నన్ను పిలిచినా వారి ముందు చేతులు కట్టుకొని జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను విమర్శించే వారంత పెద్దవాడిని కాదు నేను.. వారికున్నంత రాజకీయ అనుభవం నాకు లేదు. నాకు పార్టీలో అవమానించడం కంటే రాజకీయంగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. నా సోదరుడి ప్రెస్‌మీట్‌లో నా బిడ్డ ప్రస్తావన చేయడం చాల బాధించింది. బయట వాళ్లు ఎన్ని మాట్లాడిన వేరు. నన్ను నా కుటుంబాన్ని విమర్శించడం బాధించింది. ప్రెస్‌మీట్‌లో మాట్లాడినోళ్లే ఏదో ఒక రోజు తెలుసుకుంటారు’’ అని ఆనం అన్నారు.

ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చాడు...

ప్రజా సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని కోరడం తప్పు చేసినట్లా అని నిలదీశారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని... రాపూరు నుంచి వెంకటగిరికి వెళ్లాలంటే రెండున్నర గంటలు పడుతోందన్నారు. 40 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నానని... ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని తెలిపారు. ‘‘నన్ను వద్దనుకుని వేరే వాళ్ళను పెట్టారు. ముగ్గురు పరిశీలకులు వచ్చారు వెళ్లారు. ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చాడు’’ అంటూ ఎద్దేవా చేశారు. 2014లో వెంకటగిరి నుంచి పోటీ చేసిన రాంకుమార్ రెడ్డి మధ్యలోనే పారిపోయారన్నారు. మూడేళ్ళ నుంచి ఎలాంటి నిధులు ఇవ్వలేదని... ఇందు కోసం న్యాయస్థానాలకు వెళదామంటూ అనుచరులకు సూచనలు చేశారు.

వెంకటగిరి నియోజకవర్గం సర్పంచులు, జడ్పీటీసీలు, మండల నాయకులు వైసీపీ (YCP)లో తాము ఉన్నామా, లేమా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. వెంకటగిరిలో అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుగా కొత్తగా వచ్చారని తెలిపారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి.. సిట్టింగ్ మంత్రి మీద గెలవడం జరిగిందని.. 2014లో అధికారంలోకి టీడీపీ రాకపోయినా టీడీపీ వెంకటగిరిలో గెలిచిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి తాను పోటీ చేశానన్నారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీ కష్టపడి పని చేస్తేనే గెలిచినట్లు చెప్పుకొచ్చారు. మళ్లీ తానే అభ్యర్థి అయితే పార్టీని గెలిపించాలని రోజూ 280 కిలోమీటర్లు మూడు సంవత్సరాలు ప్రయాణం చేశానన్నారు. ఇప్పటికే వెంకటగిరిలో పార్టీ రెండు భాగాలు అయ్యాయాని... మూడో భాగం అయినా ఆశ్చర్యపడాల్సి అవసరం లేదని తెలిపారు. తాను ఏర్పాటు చేసిన మండల కన్వీనర్లు, కమిటీలను నిర్వీర్యం చేశారన్నారు. అర్హులు కాని.. గుర్తింపు లేని వాళ్లను కొత్తవారిగా నియమించారని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-02-02T15:45:34+05:30 IST