Share News

Chinajiyar Swami : పాలకులే ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారు

ABN , First Publish Date - 2023-12-07T22:03:42+05:30 IST

ప్రజలను బద్ధకస్తులుగా, బలహీనులుగా ఎందుకూ కొరకరాని వారిగా పాలకులే మారుస్తున్నారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు.హనుమాన్ జంక్షన్ దగ్గర గురువారం నాడు వీరవల్లిలో నూతనంగా నిర్మించిన కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీని చినజీయర్ స్వామి, చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రారంభించారు.

Chinajiyar Swami : పాలకులే ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారు

కృష్ణా: ప్రజలను బద్ధకస్తులుగా, బలహీనులుగా ఎందుకూ కొరకరాని వారిగా పాలకులే మారుస్తున్నారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు.హనుమాన్ జంక్షన్ దగ్గర గురువారం నాడు వీరవల్లిలో నూతనంగా నిర్మించిన కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీని చినజీయర్ స్వామి, చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రారంభించారు. రైతులకు రెండో విడత బోనస్‌గా 14 కోట్ల రూపాయలను చినజీయర్ స్వామి చేతుల మీదుగా చలసాని ఆంజనేయులు అందజేశారు. మొదటి విడతగా గతంలో 15కోట్లు బోనస్ ఇచ్చారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ...‘‘గతంలో మన ఊరు సామర్థ్యం పెంచాలనే తపనతో ప్రజలు పని చేసేవారు. నేడు ఇంటి నుంచి బయటకు కదలకుండా డబ్బులు ఇస్తుంటే ప్రజలకు బద్ధకం పెరిగిపోతుంది. కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రం రైతులకు మేలు చేసే విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం అభినందనీయం. అందరికన్నా ఎక్కువ మద్దతు ధర, బోనస్‌లు ఇవ్వడం ద్వారా మరింత మంది పాడి పరిశ్రమలో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది’’ అని చినజీయర్ స్వామి తెలిపారు.

నేటి యువతలో ఆ ఆలోచన లేదు

‘‘కృష్ణా మిల్క్ యూనియన్‌ను జాతీయస్థాయిలో ఉండే పరిణామాలతో నడపడం చాలా గొప్ప విషయం. కృష్ణా, గోదావరి, కావేరి నదుల వైపు ఇటువంటి ఫ్యాక్టరీలను విస్తరించాలి. కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో పశువులు సాకాలనే ఆకాంక్ష అందరిలో ఉండేది. నేటి యువతలో ఆ ఆలోచన ఎక్కడా కనిపించడం లేదు.మనిషిలో మంచి సంకల్పం బలంగా ఉంటే.. తప్పకుండా సాధిస్తారు. ఇది మంచి సంకల్పం కాబట్టే తుఫాన్ కూడా ఆగి మనకు సహకరించింది. కృష్ణాజిల్లా ఒకనాడు మన దేశానికే అన్నపూర్ణగా ప్రసిద్ధి. ఆ పరిస్థితిని మనం కోల్పోకూడదు. అందరూ కలిసి కట్టుగా అన్నపూర్ణగా జిల్లా పేరు సార్థకం చేయాలి’’ అని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.


ఏడాదికి యాభై కోట్లకు పైగా బోనస్‌లు ఇస్తున్నాం

‘‘400 లీటర్లతో కృష్ణా మిల్క్ యూనియన్‌ను ప్రారంభించామని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ....‘‘నేడు ఆరు లక్షల లీటర్ల పాల సేకరణతో దేశంలోనే అగ్రగామిగా ఉంది. రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తూ.. యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాం. రైతులే నేరుగా తన ధరను తాను నిర్ణయించుకుని లాభాలు తీసుకుంటున్నాడు. ఏడాదికి యాభై కోట్లకు పైగా బోనస్‌లను రైతులకు ఇస్తున్నాం. విజయవాడలో ఒక పాల ఫ్యాక్టరీ ఉండగా, ఇప్పుడు రెండోది కూడా నిర్మించాం. అమూల్ తరహాలో ప్రభుత్వం కూడా కృష్ణా మిల్క్ యూనియన్‌కు ఇస్తే మంచి ఫలితాలు సాధించి చూపుతాం. భవిష్యత్‌లో రైతులకు మరింత మేలు చేసే విధంగా పాల సేకరణ ధర, బోనస్‌లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన యంత్రాలను కూడా ఈ కొత్త ఫ్యాక్టరీలో నెలకొల్పాం. రైతులుకు కూడా అందుబాటులోకి వచ్చిన యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సహకరించాలి’’ అని చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-07T22:03:50+05:30 IST