#JusticeForYSViveka : ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లో జస్టిస్ ఫర్ వివేకా

ABN , First Publish Date - 2023-03-15T11:12:02+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి గురై నేటితో నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా ఆయన పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరుతూ..

#JusticeForYSViveka : ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లో జస్టిస్ ఫర్ వివేకా

కడప : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి గురై నేటితో నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా ఆయన పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరుతూ #JusticeForYSViveka అనే యాష్ టాగ్‌తో ట్విట్టర్‌లో ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

ముఖ్యమంత్రి జగన్‌ బాబాయ్‌, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై నాలుగేళ్లు. ఆయనను 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని స్వగృహంలోనే దారుణంగా హత్యచేశారు. గొడ్డలివేటుతో పాశవికంగా మట్టుబెట్టారు. కత్తులు దూసే కడప రాజకీయంలో అజాతశత్రువుగా వివేకాకు పేరు. ఎన్ని పదవులు అలంకించినా వాటిని తలకు ఎక్కించుకోని సౌమ్యునిగా, అందరివాడుగా మెలిగారు. అలాంటి నేత కిరాతక హత్యకు గురికావడం అప్పట్లో పెను సంచలనం రేపింది. ఆయన మరణం విషయం తెలుస్తూనే.. తొలుత రక్తవాంతులు చేసుకుని గుండెపోటుతో మృతిచెందారు అంటూ జగన్‌ సొంత మీడియా ప్రకటించింది. వివేకా మరణంపై ఆయన కూతురు సునీత అనుమానం వ్యక్తం చేయడంతో అది చివరికి హత్యగా తేల్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి హత్య చేశారంటూ జగన్‌ అండ్‌ కో ఆరోపణలు చేశారు. జగన్‌ మీడియాలో ‘నారాసుర రక్తచరిత్ర’ పేరిట కథనాలు వండివార్చారు. వివేకా హత్యపై అప్పటి ఎస్పీ మహంతి ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేశారు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. జగన్‌ సీఎం అయిన తరువాత విచారణ నెమ్మదించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు.

సునీత పోరాటంతో.,.

వివేకా హత్య కేసులో దోషులెవరో తేల్చేందుకు సీబీఐ విచారణ కోసం ఆయన కూతురు కోర్టుమెట్లెక్కారు. సీబీఐ విచారణను జరిపించేలా కోర్టును ఒప్పించారు. దేశంలో రాజకీయ పార్టీల నాయకులకు, కార్పొరేట్‌ శక్తులకు సైతం సీబీఐ విచారణ అంటే వణుకు. అలాంటి సీబీఐ బృందానికే కడప యిజం చూపించారు. విచారణ అధికారి రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేయించారు. కడప వదిలిపోకపోతే బాంబులేసి లేపేస్తామంటూ సీబీఐ బృందం డ్రైవరుకు బెదిరింపులు వచ్చాయి. వివేకా కేసులో ఎర్రగంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ యాదవ్‌, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిపై సీబీఐ చార్జిషీట్‌ నమోదు చేసింది. వీరిలో ఎర్రగంగిరెడ్డి బెయిల్‌పై బయట ఉండగా, షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. మిగతా ముగ్గురు హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. దస్తగిరి వాంగ్మూలం మేరకు అవినాశ్‌రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డిపై కేసు నమోదుచేశారు. దీంతో ఈ కేసు అత్యంత కీలక మలుపు తిరిగింది. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు అనుమానితుల జాబితాలోకి వచ్చిచేరాయి.

Updated Date - 2023-03-15T11:12:02+05:30 IST