High Court: ఫ్లెక్సీల నిషేధంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2023-01-25T20:40:06+05:30 IST

ఫ్లెక్సీల (flexies) నిషేధంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది

High Court: ఫ్లెక్సీల నిషేధంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి: ఫ్లెక్సీల (flexies) నిషేధంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ యూజ్ ఫ్లెక్సీలకు మాత్రమే నిషేధం వర్తిస్తుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓవెన్, పీవీసీ ఫ్లెక్సీలకు నిషేధం వర్తించదని హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుంది. ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రింటర్లకు ఇప్పటికే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచించింది. ఒక చదరపు అడుగు ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ దొరికినా మొదటి తప్పిదంగా పరిగణించి రూ.50వేలు, రెండోసారి దొరికితే రూ.లక్ష జరిమానా వేస్తామని, షాపును కూడా సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో నోటీసులు జారీ చేయడంతో పాటు వారితో సమావేశమై ఆంక్షలు వివరిస్తున్నారు. దుకాణాల ముందున్న వాటిని కూడా తీసేయాలని స్పష్టం చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌గా పరిగణించి ఫ్లెక్సీలను నిషేధించిన ప్రభుత్వం... రూ.లక్షలు పెట్టుబడి పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమకు ప్రత్నామ్నాయ మార్గాలు చూపడం లేదు. నిషేధం అమలు చేస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమని ప్రింటర్లు వాపోతున్నారు. కొవిడ్‌ కారణంగా వ్యాపారం లేక రెండున్నరేళ్ల పాటు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని, ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయంలో నిషేధం పేరుతో ఉపాధిని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీ రంగంపై ఆధారపడిన వేలాది మంది ఆందోళనబాట పట్టే పరిస్థితి నెలకొంది. మరోవైపు దుకాణదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. దుకాణాలపై ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను తీసేస్తే ప్రత్యామ్నాయ పబ్లిసిటీ బోర్డులు, హోర్డింగ్‌ల ఏర్పాటుకు అదనపు ఖర్చు అవుతుందంటున్నారు.

Updated Date - 2023-01-25T20:45:54+05:30 IST