Nalugella Narakam TDP: మరో కొత్త ప్రచారానికి టీడీపీ శ్రీకారం! నాలుగేళ్ల నరకం పేరుతో వీడియో విడుదల

ABN , First Publish Date - 2023-06-26T16:06:52+05:30 IST

తెలుగు దేశం పార్టీ మరో కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వ తీరుకు నిరసనగా అనేక కార్యక్రమాలతో దూసుకెళ్లిపోతుండగా.. తాజాగా 'నాలుగేళ్ల నరకం' పేరుతో మరో కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారు.

Nalugella Narakam TDP: మరో కొత్త ప్రచారానికి టీడీపీ శ్రీకారం! నాలుగేళ్ల నరకం పేరుతో వీడియో విడుదల

అమరావతి: తెలుగు దేశం పార్టీ మరో కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వ తీరుకు నిరసనగా అనేక కార్యక్రమాలతో దూసుకెళ్లిపోతుండగా.. తాజాగా 'నాలుగేళ్ల నరకం' (Nalugella Narakam ) పేరుతో మరో కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఓ వీడియో విడుదల చేశారు.

BABU.jpg

చంద్రబాబు..

రానున్న రోజుల్లో గల్లీ నుంచి పట్టణాల వరకు ప్రజలకి జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ "నాలుగేళ్ల నరకం" కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడ్తారన్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తుచూపుతూ జనంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేలా నాలుగేళ్ల నరకం కార్యక్రమం ఉంటుందని.. జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ.. నలభైఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ.. ప్రజల వద్దకు నేతలు తీసుకెళ్తారన్నారు. క్యాంపెయిన్‌లో భాగంగా తొలి రోజు 'ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..?' అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు గురించి ప్రశ్నిస్తూ చంద్రబాబు వీడియో విడుదల చేశారు.

వీడియోలో ఏముంది అంటే..

ఇది రాష్ట్రామా? రావణ కాష్టమా? (Rashtramaa Ravana Kaashtamaa)అంటూ ఏపీలో వరుస దుర్ఘటనలు వీడియోలో చూపించారు. నాలుగేళ్ల నరకం అంటూ వివిధ ఉదాహరణలు ఇందులో చూపించారు. టెన్త్ కుర్రాడిని వైసీపీ నేతలు సజీవ దహనం చేసినా, ఏలూరులో యాసిడ్ దాడి జరిగినా ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. నెల్లూరు, మచిలీపట్నంలో అత్యాచారం ఘటనల పైనా సీఎం ఏం మాట్లాడలేదని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతో ఓ మహిళను ట్రాక్టర్‌తో గుద్దించి చంపినా ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వరుస సంఘటనలు జరిగితే ఈ బిడ్డ శాంతి భద్రతలపై కనీస సమీక్ష చేయలేదని నిలదీశారు. ఏదైనా దుర్ఘటన జరిగితే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా చిక్కటి చిరునవ్వుతో చనిపోయిన వారి కుటుంబాలకు డబ్బులు అందించటం మాత్రమేనని దుయ్యబట్టారు. నిజంగా ప్రజల బిడ్డే అయితే దాడులు చేసిన సొంత పార్టీ నేతలను కాపాడుకుంటారా? మీ బిడ్డే అయితే నష్ట పరిహారాన్ని నవ్వుతూ ఇప్పిస్తారా? ప్రజల బిడ్డే అయితే పేదల ప్రాణాలు వెలకట్టే పెత్తందారు అయ్యేవాడా? అంటూ సీఎం జగన్ ఉద్దేశిస్తూ వీడియోలో టీడీపీ మండిపడింది.

Updated Date - 2023-06-26T16:07:29+05:30 IST