Jagan Meets Modi: మోదీతో ముగిసిన జగన్ భేటీ.. అంతకు ముందు ఢిల్లీలోని జగన్ నివాసంలో ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-03-17T12:33:24+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ (Jagan Meets Modi) ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Sessions) జరుగుతున్నప్పటికీ.. వాటిని పక్కనపెట్టి మరీ ఢిల్లీకి జగన్ ఫ్లైటు (Jagan Delhi Tour) ఎక్కడంతో హస్తినకు ఈ సడన్ టూర్ ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. గురువారం ఉదయం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. సాయంత్రానికి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ బాగా దూకుడు పెంచిన తరుణంలో మోదీతో జగన్ భేటీ కావడంతో రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి.
పైగా.. ప్రధాని మోదీని జగన్ కలవడం కంటే ముందు వివేకా కేసులో ఒక కీలక పరిణామం జరిగింది. తనపై ఎలాంటి కఠిన చర్యలు (అరెస్ట్ లాంటి నిర్ణయం) తీసుకోవద్దని ఆదేశించాలంటూ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తన విచారణపై స్టే ఇవ్వాలన్న అవినాశ్‌రెడ్డి పిటిషన్ తిరస్కరించింది. అరెస్ట్ చేయొద్దని తాము చెప్పలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ పరిణామం జరిగిన కాసేపటికే.. ఢిల్లీలోనే ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి జగన్‌ను కలిశారు. ప్రస్తుతం జగన్ నివాసంలోనే అవినాశ్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. ఈ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయంలో స్పష్టత లేదు కానీ ఆ తర్వాత సీఎం జగన్ రెడ్డి పార్లమెంట్‌కు చేరుకోవడం, ప్రధాని మోదీతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా.. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు పిలిపించి ప్రశ్నించింది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపైనా దృష్టి సారించింది. తండ్రీకొడుకులిద్దరినీ కలిపి ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కీలక నిందితులని, అరెస్టు చేయడం ఖాయమని సీబీఐ తెలంగాణ హైకోర్టుకే స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ కేసు విచారణలో సీబీఐ తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్లింది. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌లను కూడా ప్రశ్నించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ మరింత ముందుకు వెళ్లే అవకాశముందని కూడా వార్తలు వస్తున్నాయి.