Year Ender 2022: సెంచరీలు బాదారు.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు!

ABN , First Publish Date - 2022-12-29T21:00:20+05:30 IST

వారు బౌలర్లను శాసించారు. పరుగుల వరద పారించారు. క్రీజులోకి దిగడంతోనే బౌలర్లకు చుక్కలు

Year Ender 2022: సెంచరీలు బాదారు.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు!
Cricketer

వారు బౌలర్లను శాసించారు. పరుగుల వరద పారించారు. క్రీజులోకి దిగడంతోనే బౌలర్లకు చుక్కలు చూపించేవారు. బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చేవారు. వారికి బంతులు విసరడమెలానో తెలియక బౌలర్లు తికమకపడేవారు. అలాంటి బ్యాటర్లు ఆ తర్వాత నీరుగారిపోయారు. బంతులు ఆడలేక తడబడ్డారు. క్రీజులోకి వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లిపోయారు. రోజులు గడిచిపోయాయి.. సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా మార్పురాలేదు. విమర్శలెదుర్కొన్నారు. జట్టులో చోటు కోల్పోయారు. అయినా నిరాశ పడలేదు. పడిలేచిన కెరటంలా ఎగసిపడ్డారు. పోయినచోటే వెతుక్కున్నారు. సంవత్సరాల తరబడి పరుగులకు ముఖం వాచిపోయిన వారు ఇప్పుడు మళ్లీ పరుగుల వరద పారిస్తున్నారు. సెంచరీలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. మరి ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1020 రోజుల తర్వాత కోహ్లీ

kohli.jpg

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎదుర్కొన్నన్ని విమర్శలు బహుశా ఏ క్రికెటర్ ఎదుర్కొని ఉండడు. క్రీజులోకి దిగితే పరుగుల వరద పారించే విరాట్ బ్యాట్ ఆ తర్వాత మూగబోయింది. సంవత్సరాల తరబడి పరుగులు చేయలేక.. ఒకానొక దశలో జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైంది. ఇక అతడు క్రికెట్‌కు టాటా చెప్పడం మేలని క్రీడా విశ్లేషకులు సైతం సూచనలు ఇచ్చారు. మాజీలు కూడా అతడి ఫామ్‌పై పెదవి విరిచారు. 22 నవంబరు 2019న విరాట్ 70వ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అతడి ఫామ్ గాడి తప్పింది. ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడ్డాడు. 2020లో 22 మ్యాచుల్లో 842 పరుగులు చేశాడు. అయితే, సెంచరీ మాత్రం సాధించలేకపోయాడు. 2021లో 24 మ్యాచుల్లో 964 పరుగులు చేశాడు. సెంచరీ మాత్రం లేదు. 2022లో అర్ధభాగం గడిచిపోయినా పరుగులు చేయడంలో తడబడ్డాడు. విమర్శలకులు తన నోళ్లకు పదునుపెట్టారు. అయితే, ఆసియాకప్‌తో అతడి పరుగుల దాహానికి తెరపడింది. ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 122 పరుగులు చేసి 1020 రోజుల తర్వాత అంతర్జాతీయ సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు.

క్లిష్ట పరిస్థితుల్లో సెంచరీ చేసి.. ఫామ్‌లోకి స్మిత్

smith.jpg

కింగ్ కోహ్లీలానే రన్‌మెషీన్‌గా పేరొందిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) కూడా సుదీర్ఘకాలం తర్వాత పరుగుల కరువు తీర్చుకున్నాడు. జనవరి 2021లో భారత్‌పై 131 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన స్మిత్ పరుగుల కోసం పరితపించిపోయాడు. ఒక్క సెంచరీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశాడు. చివరికి జులై 2022లో అతడి ఎదురుచూపులకు తెరపడింది. శ్రీలంకపై క్లిష్ట పరిస్థితుల్లో సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత డబుల్ సెంచరీతోపాటు మరో రెండు సెంచరీలు సాధించాడు.

67 ఇన్నింగ్స్‌లు ఆడి కూడా..

warner.jpg

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌(David Warner)ది కూడా ఇదే పరిస్థితి. 14 జనవరి 2020న భారత్‌పై సెంచరీ చేసి 43వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత 67 ఇన్నింగ్స్‌లు ఆడి కూడా మరో సెంచరీ సాధించలేకపోయాడు. అయితే, ఈ ఏడాది నవంబరు 22న ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 106 పరుగులు చేసి పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు.

1443 రోజుల తర్వాత పుజారా

pujara.jpg

క్రీజులోకి వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరుతూ చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. వరుస వైఫల్యాలు వెంటాడుతున్నా అతడిని ఇంకా కొనసాగిస్తూ ఉండడంపై సెలక్టర్లపైనా విమర్శలు వెల్లువెత్తాయి. జట్టుకు భారంగా మారిన పుజారా ఇక క్రికెట్‌ నుంచి తప్పుకోవడం బెటరని పలువురు మాజీ క్రికెటర్లు కూడా సూచించారు. విమర్శలను తట్టుకుంటూనే రాణించేందుకు ప్రయత్నించాడు. 3 జనవరి 2019లో ఆస్ట్రేలియాపై 193 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. అయితే, ఆ తర్వాత మాత్రం గాడి తప్పాడు. 2020-21లో 18 టెస్టులు ఆడి 865 పరుగులు చేశాడు. ఈ ఏడాది చివరికి వచ్చేశాక ఈ నెల 14న బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో 102 పరుగులు చేసి 1443 రోజుల ఎదురుచూపులకు తెరదించాడు.

Updated Date - 2022-12-29T21:00:22+05:30 IST