Jaggayya-Alluri Sitarama Raju Movie: విలన్ కాని విలన్.. అల్లూరి సీతారామరాజులో ఛాన్స్ రాగానే జగ్గయ్య ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-12-31T17:31:48+05:30 IST

రూథర్ ఫర్డ్ అప్పటి మన్య ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ కాబట్టి, స్థానికంగా అతను విలన్ కావడం సహజమే. కానీ, అదే రూథర్ ఫర్డ్ అంటే ఆయన కలెక్టరుగా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజాబాంధవుడనే భిన్నమైన అభిప్రాయం ఉండేది.

Jaggayya-Alluri Sitarama Raju Movie: విలన్ కాని విలన్.. అల్లూరి సీతారామరాజులో ఛాన్స్ రాగానే జగ్గయ్య ఏం చేశారంటే..

'అల్లూరి సీతారామరాజు ( Alluri Sitarama Raju Movie) 'సినిమాలో బ్రిటీష్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ గా ‘కళావాచస్పతి’ కొంగర జగ్గయ్య (Jaggayya ) నటకౌశలానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ఎంతగానో ప్రశంసించారట. కాగా, ఆ పాత్రని రూపుదిద్దే విషయంలో జగ్గయ్య తీసుకున్న శ్రద్ధ గురించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొనవల్సి ఉంది.

రూధర్ ఫర్డ్ తో ముడిబడ్డ బాల్యస్మృతులు

"స్వాతంత్ర్య వీరుడా... స్వరాజ్యభానుడా అల్లూరి సీతారామరాజా..." అని పాటరాశాడు మహాకవి శ్రీశ్రీ, అల్లూరి సీతారామరాజు సినిమాలో (Alluri Sitarama Raju Movie Flashback ). ఆ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 1924 మే 7 బ్రిటీష్ తూటాలకి బలైపోయాడు. తన కోసం తెల్లవాళ్ల చేతిలో నరకయాతనలు పడుతున్న తన జనాన్ని కాపాడుకోవడానికి పట్టుబడిపోతాడు ఆ త్యాగశీలి. ఆయనని ఒక చెట్టుకి కట్టి ఎటువంటి విచారణ లేకుండా కాల్చిచంపుతాడు బ్రిటీష్ మేజర్ గుడాల్. స్వాతంత్ర్య కాంక్షనీ, విప్లవస్ఫూర్తిని అణిచివేయడంలో పేరుమోసిన రూథర్ ఫర్డ్ ఆధ్వర్యంలోనే అల్లూరి హతమౌతాడు.

Alluri-2.jpg

రూథర్ ఫర్డ్ అప్పటి మన్య ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ కాబట్టి, స్థానికంగా అతను విలన్ కావడం సహజమే. కానీ, అదే రూథర్ ఫర్డ్ అంటే ఆయన కలెక్టరుగా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజాబాంధవుడనే భిన్నమైన అభిప్రాయం ఉండేది. ముఖ్యంగా తెనాలి, రేపల్లె తాలూకాల్లో ప్రజారోగ్యం, ఆస్పత్రుల అభివృద్ధి వంటి అనేక విషయాల మీద కలెక్టర్ టీజీ రూథర్ ఫర్డ్ ప్రత్యేకశ్రద్ధ చూపించడమే కాకుండా, అధికారిక సమావేశాలలో స్వయంగా పాల్గొనడం, పిల్లలమర్రి ఆంజనేయులు, జెట్టి అంకినీడు, డాక్టర్ ఉళ్ళకి, డాక్టర్ మాధవాచారి వంటి స్థానిక ప్రముఖులతో సన్నిహితంగా మెలగడం వంటివి చేసేవారట. అవన్నీ చిన్ననాటి స్మృతులుగా జగ్గయ్యలో ముద్రపడిపోయాయి. 1940ల వరకూ కూడా రూథర్ ఫర్డ్ తో స్థానికంగా సంబంధ బాంధవ్యాలూ ఉండేవట.

Alluri-Sitarama-Raju-Movie-.jpg

చిత్రరచయిత మహారథితో మంతనాలు

అల్లూరి సీతారామరాజు సినిమాలో రూథర్ ఫర్డ్ వేషానికి తనని ఎంపిక చేసుకోగానే, ఆయన గురించి మరింత సమాచారం కోసం ప్రయత్నించారట జగ్గయ్య. రూథర్ ఫర్డ్ వ్యక్తిత్వం, పనితీరులోని మరికొన్ని కోణాలు అర్థం కావడం, ఆయనకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని కూడా తెలియడం జగ్గయ్యలో ఆలోచనలకి దారితీసింది. అందువల్ల, రూథర్ ఫర్డ్ పాత్రని మూసధోరణిలో విలన్ గా చిత్రించడానికి ఆయన ఇష్టపడలేదు. అల్లూరి సత్యనిష్ఠకీ, పోరాటంలోని నిజాయితీకి వ్యక్తిగతంగా ఆకర్షితుడైనా, బ్రిటీష్ అధికారిగా తన వృత్తిధర్మంలో భాగంగా అల్లూరికి వ్యతిరేకంగా వ్యవహరించవల్సి వచ్చినట్టు రూథర్ ఫర్డ్ పాత్రని తీర్చిదిద్దేలా చేశారు.

చిత్ర రచయిత త్రిపురనేని మహారథిని కలిసి, రూథర్ ఫర్డ్ పాత్రను రొటీన్ విలన్ లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చాలని కోరారట. అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో రూథర్ ఫర్డ్ తో పాటు అల్లూరి పాత్ర మరింతగా ఔన్నత్యాన్ని సంతరించుకుంది. అన్ని ఆలోచనలు చేసి, అంత జాగ్రత్త తీసుకున్నారు కనుక, ఆ ఆలోచనకి ప్రాణం పొస్తూ జగ్గయ్య పాత్రపోషణ చేశారు గనుకనే ఆ సినిమా చూశాక ఆయనని పీవీ పొగడ్తల్లో ముంచెత్తారు.

Alluri-3.jpg( తెనాలి ప్రముఖులతో రూథర్ ఫర్డ్ (ఎర్ర సర్కిల్ లో ఉన్న వ్యక్తి) - 1923ప్రాంతంలో..
'జయహో తెనాలి' (బి.ఎల్. నారాయణ) పుస్తకం నుంచి.. )

( డిసెంబర్ 31న జగ్గయ్య జయంతి సందర్భంగా.. )

Updated Date - 2022-12-31T20:14:29+05:30 IST