Share News

Lok Sabha Elections 2024: నామా ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 09:49 PM

లోక్‌సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao)ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ఉద్ఘాటించారు.

Lok Sabha Elections 2024: నామా ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
KCR

ఖమ్మం జిల్లా: లోక్‌సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao)ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఖమ్మం అభివృద్ధికి పాటుపడుతారని తెలిపారు. తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మెడలు వంచి అందరికీ రైతుబంధు వచ్చేలా చేస్తానని మాటిచ్చారు. సోమవారం నాడు ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల సమన్లు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దయతోనే రాష్ట్రంలో సంక్షేమం ప్రారంభమైందని చెప్పారు. ఎన్టీఆర్ దయతో పేదలకు పట్టెడు అన్నం దొరికిందని వివరించారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్‌ను మించి సంక్షేమ పథకాలు అమలు చేశానని తెలిపారు. అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నానని ఉద్ఘాటించారు. తెలంగాణలో పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండాయని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పడిన పంటను కొనమని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పిందన్నారు. ఆ సమయంలో ఒక్క బీజేపీ ఎంపీ, ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ, నామా నాగేశ్వరావు మాత్రమే కేంద్రంతో కొట్లాడారని స్పష్టం చేశారు.


Ponnala Laxmaiah: 1.85 శాతం ఓట్లతో ఓడిపోయిన బీఆర్‌ఎస్ చచ్చిన పాము ఎలా అవుతుంది?

గోదావరిలో తెలంగాణకు రావాల్సిన వాటాని ఎత్తుకొని పోతా.. తమిళనాడు, కర్ణాటక‌కు నీళ్లు ఇస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్లియర్‌గా చెప్పారని అన్నారు. ప్రధాని మోదీని ఎవరూ నిలదీయలేదని.. సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించరని అన్నారు. మోదీ గతంలో ఈ ప్రతిపాదన పెట్టారని.. తాను ఈ ప్రతిపాదనను వ్యతిరేకించానని అన్నారు. తన తల తెగిపడిన ఆయన ప్రతిపాదనకు ఒప్పుకోలేదన్నారు.

రాష్ట్రంలో ఉండే నీటి వాటా తనకు కావాలని తేల్చిచెప్పానని అన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నానని ఉద్ఘాటించారు. ఒక్క గజం భూమిని కూడా వృథా కాకుండా పంటలు పండించాలనే తలంపుతో సీతారామ ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేశానని వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేటాయించి పనులు ప్రారంభించానని గుర్తుచేశారు.


Kingfisher Beer: కింగ్‌ఫిషర్ బీర్లు దొరకట్లేదు.. ఆదుకోండి మహాప్రభో!!

మన హక్కుల కోసం, మన నిధుల కోసం పేగులు తెగేలా కొట్లాడతానని చెప్పారు. ఖమ్మంలో మంత్రి భట్టివిక్రమార్క ఉన్నారని.. ఆయన వట్టి విక్రమార్కగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడే భాష చూస్తే దారుణంగా ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన వ్యక్తిని జైల్లో వేస్తారా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తారని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. తెలంగాణలో అంతా రాజకీయ అనిచ్చితి ఉందని ఎవరూ ఎటు వైపు పోతారో తెలియట్లేదని చెప్పారు.


ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇంకా చాలా మంది రైతులకు రైతుబంధు రాలేదని.. రైతు బంధు కోసం కొట్లాడతామని మాటిచ్చారు. వీళ్ల మెడలు వంచి పాత పద్ధతిలో రైతు బంధు అందరికీ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.

Bandi Sanjay: నువ్వొక డ్రామా ఆర్టిస్ట్.. నీ అయ్య లేకుంటే నీ బతుకేంది?

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 29 , 2024 | 10:16 PM