నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:41 AM
పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది.
ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన
విశాఖపట్నం, అమరావతి, పోలవరం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా.. శుక్రవారం కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో వేసవి మాదిరి ఎండ కాసింది. పగటి ఉష్ణోగ్రలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో అత్యధికంగా 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అల్పపీడనం ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది.
గోదావరి తగ్గుముఖం
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులు ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, సీలేరు జలాలతో పెరిగిన గోదావరి నీటిమట్టం... శుక్రవారం నాటికి తగ్గుముఖం పట్టింది. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 26.70 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 4,01,465 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్టు డీఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. స్పిల్‌వే ఎగువన 29.900 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యామ్‌కి ఎగువన 30.000 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ఈ ఇంటి కాంట్రాక్టర్‌కు దండం పెట్టొచ్చు..