నేడు అండమాన్‌లో అల్పపీడనం
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:07 AM
ఉత్తర థాయ్‌లాండ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో శనివారం ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు.
తీవ్ర వాయుగుండం లేదా తుఫాన్‌గా మారే అవకాశం
విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉత్తర థాయ్‌లాండ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో శనివారం ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. ఆ తర్వాత అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈ నెల 20వ తేదీ రాత్రి లేదా.. 21వ తేదీ ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా బలపడనుందని అంచనా వేశారు.
ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈనెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా లేదా తుఫాన్‌గా బలపడుతుందని, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా దానికి ఆనుకుని దక్షిణ ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈనెల 22, 23 తేదీల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు.. పశ్చిమ రాజస్థాన్ నుంచి శనివారం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం కానుంది.
ఈ వార్తలనూ చదవండి...