Share News

ఇక రెండు జడ్పీలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:11 PM

ఇక రెండు జడ్పీలు

ఇక రెండు జడ్పీలు

25 నుంచి నంద్యాలలో నూతన జడ్పీ కార్యాలయం

కర్నూలుకు 25, నంద్యాలకు 28 మండలాలు

పరిపాలన వికేంద్రీకరణకు అవకాశం

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా నుంచి నంద్యాల జిల్లా వేరై నాలుగేళ్లు దాటినా జిల్లా ప్రజా పరిషత్‌ మాత్రం పాత జిల్లా ప్రాతిపదికనే కొనసాగుతోంది. ఈ పరిస్థితి ఇక మారనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో 28 జిల్లాలకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గత శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకుకర్నూలు కేంద్రంగా ఉన్న ఒకే జడ్పీ ఇక నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాలకు వేర్వేరు జడ్పీలు ఏర్పడనున్నాయి. ఈ మార్పు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత జడ్పీటీసీల పదవీకాలం ఈ నెల 24తో ముగిసిన అనంతరం చట్టబద్ధ ప్రక్రియ పూర్తి చేసి కొత్త జడ్పీలను ఏర్పాటు చేయనున్నారు.

కర్నూలు జడ్పీ పరిధిలో 25 మండలాలు..

ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబరు.115లోని ప్రకారం కర్నూలు జిల్లా పరిషత్‌లో 25 మండల ప్రజాపరిషత్‌లు ఉంటాయి. అవి ఆదోని, ఆలూరు, ఆస్పరి, సీ. బెళగల్‌, చిప్పగిరి, దేవనకొండ, గోనెగండ్ల, గూడూరు, హాలహర్వి, హొళగుంద, కల్లూరు, కోడుమూరు, కోసిగి, కౌతాళం, క్రిష్ణగిరి, కర్నూలు, మద్దికెర ఈస్ట్‌, మంత్రాలయం, నందవరం, ఓర్వకల్లు, పత్తికొండ, పెద్దకడుబూరు, తుగ్గలి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు.

నంద్యాల జడ్పీ పరిధిలో 28 మండలాలు..

నంద్యాల జిల్లా జడ్పీ పరిధిలోఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె, బండిఆత్మకూరు, బేతంచెర్ల, చాగలమర్రి, డోన్‌(ద్రోణాచలం), దొర్నిపాడు, గడివేముల, గోస్పాడు, జూపాడుబంగ్లా,కోవెలకుంట్ల,కొలిమిగుండ్ల, కొత్తపల్లి, మహానంది, మిడ్తూరు, నందికొట్కూరు, నంద్యాల, అవుకు, పగిడ్యాల, పాములపాడు, పాణ్యం, ప్యాపిలి, రుద్రవరం, సంజామల, శిరివెళ్ల, ఉయ్యాలవాడ, వెలుగోడు మండల ప్రజా పరిషత్‌లు ఉంటాయి. ఈ భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా మండల ప్రజా పరిషత్‌లను సంబంధిత జిల్లా ప్రజా పరిషత్‌లకు మ్యాపింగ్‌ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

జిల్లాకో జడ్పీ..

ఇప్పటి వరకు పాత జిల్లాల ప్రాతిపదికన ఉన్న జడ్పీ పరిధులు ప్రస్తుతం ఉన్న జిల్లా సరిహద్దులతో సరిపోలని పరిస్థితి ఉంది. కొత్త విధానంలో జిల్లా జడ్పీ, మండల పరిధులు ఒకే భౌగోళిక నిర్మాణలోకి వస్తాయి. దీంతో ఏ పథకానికి ఎవరు బాధ్యత వహించాలి? ఏ ప్రాంతం ఏ జడ్పీ పరిధిలోకి వస్తుంది? అనే అంశాల్లో స్పష్టత పెరుగుతుంది. వీటితో పాటు నిధుల ప్రణాళికలో ప్రాంతీయ ప్రాధాన్యం పెరగనుంది. ముఖ్యంగా కర్నూలు అవసరాలు కర్నూలుజడ్పీ ప్రణాళికలో, నంద్యాల అవసరాలు నంద్యాల జడ్పీ ప్రణాళికలో ప్రతిబింబించడానికిఅవకాశం పెరుగుతుంది. ఒకే జడ్పీ కింద వివిధ ప్రాంతాలకునిధుల కేటాయింపులో ప్రాధాన్యత కంటే, చిన్న భౌగోళిక పరిధిలో స్థానిక అవసరాలను గుర్తించి ప్రణాళిక రూపొందించినప్పుడు సరైన ప్రాధాన్యత దొరుకుతుంది. వీటితో పాటు పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. ప్రభుత్వం స్వయంగా జడ్పీలకు పరిపాలన, ప్రణాళిక, సమన్వయం, పర్యవేక్షణ, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి బాధ్యతలను నిర్దేశించి

రాష్ట్రంలో 28 జడ్పీలకు ప్రత్యేక కార్యనిర్వాహక నాయకత్వం కల్పించేందుకు ప్రభుత్వం 15 అదనపు సీఈఓ, 15 అదనపు డిప్యూటీసీఈఓ పోస్టులు మొత్తం 30 పోస్టులు మంజూరు చేసింది. ఈ నెల 22న సీఈఓ, డిప్యూటీ సీఈఓల నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం 13 చొప్పున ఉన్న సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులను 28 జడ్పీలకు అనుగుణంగా పెంచుతుంది. దీంతో కర్నూలు, నంద్యాల జిల్లా పరిషత్‌లకు కూడ ప్రత్యేక పరిపాలన నాయకత్వ వ్యవస్థ ఏర్పడుతుంది.

పరిపాలన వ్యయం పెరుగుతుంది

రాష్ట్రంలో 28 జడ్పీలు ఏర్పడటంతోపాలనా వ్యయం పెరుగుతుంది. కొత్త సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులు, కార్యాలయాలు, సిబ్బంది, వాహనాలు, మౌలిక సదుపాయాలకు పరిపాలనావ్యయం పెరుగుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సిబ్బందిని మండలాల సంఖ్య, భౌగోళిక పరిధి, పనిభారం, విధుల అవసరాలు, సిబ్బంది ప్రమాణాల ఆధారంగా హేతుబద్ధీకరించి 28 జడ్పీలకు సర్దుబాటు చేయాలని పేర్కొంది. కాబట్టి అదనపు వ్యయం ఎంత ఉంటుందనే అంశాన్ని ప్రస్తుతం ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా వెల్లడించలేదు.

ప్రారంభంలో పరిపాలన గందరగోళం..

మ్యాపింగ్‌, రికార్డుల మార్పు, సిబ్బంది కేటాయింపు, ఆస్తులు, బాధ్యతల విభజన, కార్యాలయాల ఏర్పాటు వంటి అంశాలు కొత్త వ్యవస్థ ప్రారంభంలో సవాళ్లుగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా అన్ని అధికారిక రికార్డులు, రిజిస్టర్లు, నోటిఫికేషన్లు, పరిపాలన వ్యవస్థలో మండలాల కేటాయింపును సక్రమంగా ప్రతిబింబించాలని ఆదేశాలు జారీ చేసింది.

రాజకీయంగా కొత్త సమీకరణాలు

జిల్లా పరిషత్‌లు కేవలం పరిపాలన సంస్థలు మాత్రమే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధిత్వానికి కీలక వేదికలు. కర్నూలు, నంద్యాలకు వేర్వేరు జడ్పీలు ఏర్పడటంతో భవిష్యత్తులో జడ్పీటీసీ స్థానాలు, జడ్పీ చైర్మన్‌ పదవులు, మండల స్థాయి రాజకీయ సమీకరణాలు కూడ ఆయా జిల్లాలకే పరిమితం కానున్నాయి. అయితే ఈ జీవోలో జడ్పీటీసీ స్థానాల సంఖ్య, రిజర్వేషన్లు, చైర్మన్‌ ఎన్నికల లేదా ఎన్నికల షెడ్యూల్‌ నిర్ణయం వెల్లడించలేదు. కాబట్టి ఆ అంశాలపై ప్రస్తుతం ఊహాగానాలకు తావులేదు.

కొత్త పరిపాలన

ఒకప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిపాలన పరిధిలో ఉన్న ప్రాంతాలు 2022లో రెవెన్యూ జిల్లాలుగా విడిపోయాయి. కానీ జిల్లా స్థాయి పంచాయతీరాజ్‌ వ్యవస్థ మాత్రం పాత నిర్మాణంలోనే కొనసాగింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెవెన్యూ జిల్లా విభజనలకు అనుగుణంగా జడ్పీ వ్యవస్థ కూడ విడిపోనుంది. ఇది కేవలం రెండు జడ్పీల పేర్లు వేరు చేయడం కాదు. జిల్లా స్థాయి పంచాయతీరాజ్‌ పరిపాలన, ప్రణాళిక, సమన్వయం, పర్యవేక్షణ వ్యవస్థను కూడ కొత్త సరిహద్దులకు అనుగుణంగా మార్చే ప్రక్రియ. మొత్తంగా ఈ నెల 24 తరువాత కర్నూలు, నంద్యాల జిల్లాలో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి రానుంది.

సిబ్బంది పునర్విభజన పూర్తి కాలేదు..

నంద్యాల జిల్లా పరిషత్‌కు కావాల్సిన సిబ్బంది పునర్విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం కర్నూలు జిల్లా పరిషత్‌ పరిపాలన భవనంలో ఉన్న వారితో పాటు మండల, ఇతర ఇంజనీరింగ్‌ విభాగాలలో పని చేస్తున్న వారి క్యాడర్‌, పని చేసి పదవీకాలం తదతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను జడ్పీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అక్కడి నుంచి ఎంత మంది నంద్యాల జిల్లా పరిషత్‌కు కేటాయిస్తారు. మిగిలిన వారు ఎంత మందిని కర్నూలు జిల్లా పరిషత్‌కు కేటాయించేదీప్రభుత్వం స్పష్టం చేయాలి. అంతే కాకుండానంద్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు నూతన జడ్పీ పరిపాలన భవనం కోసం భవనాన్ని ఇంకా గుర్తించకపోవడం గమనార్హం. ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రంలో మైనార్టీ శాఖ భవనం, డీఎల్‌డీఓ భవనాలను పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు.

తాత్కాలికంగా ఎంపీడీఓ కార్యాలయ భవనం

తాత్కాలికంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎంిపీడీఓ కార్యాలయం భవనం పైన ఉన్న భవనాన్ని జడ్పీ భవనంగా పరిశీలిస్తున్నాం.శాశ్వత భవనం కోసం నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌ సూచనల మేరకు ఇతర భవనాలకు పరిశీలిస్తున్నాం.

Updated Date - Sep 18 , 2026 | 11:11 PM