కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:17 PM
మన్యంలో కాఫీ తోటలతో గిరిజనుల జీవనోపాధిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష ఎకరాల కాఫీ ప్రాజెక్టుకు ఆదిలోనే తూట్లు పడుతున్నాయి.
అధికారుల స్వార్థం.. లక్ష ఎకరాలకు శాపం
నాసిరకం మొక్కల పంపిణీతో అసలుకే నష్టం
ముఖ్యమంత్రి మంజూరు చేసిన ప్రాజెక్టుపైనే అధికారుల నిర్లక్ష్యం
ఇంత జరిగినా.. కలెక్టర్ మౌనమెందుకో?
ఉన్నత స్థాయి విచారణతోనే అక్రమాలకు అడ్డుకట్ట
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
మన్యంలో కాఫీ తోటలతో గిరిజనుల జీవనోపాధిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష ఎకరాల కాఫీ ప్రాజెక్టుకు ఆదిలోనే తూట్లు పడుతున్నాయి. వాస్తవానికి 2016లో మంజూరైన కాఫీ ప్రాజెక్టు 2025 నాటికి ముగియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధతో గతేడాది మరో లక్ష ఎకరాల కాఫీ ప్రాజెక్టును మంజూరు చేశారు. అయితే సీఎం స్వయంగా కాఫీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా.. జిల్లా స్థాయి అధికారులు అలక్ష్యం వహిస్తున్నారు. కాఫీ ప్రాజెక్టుకు నాసిరకం మొక్కలను పంపిణీ చేస్తూ, తమ జేబులు నింపుకొంటూ సీఎం ఆశయానికి గండి కొడుతున్నారు. ముఖ్యంగా కాఫీ మొక్కలకు నీడ నిచ్చే సిల్వర్ ఓక్ మొక్కలే ప్రధానం. వాటిపై అధికారులు మరింత శ్రద్ధగా వ్యహరించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా నాసిరకం మొక్కలు పంపిణీ చేయడంతో ఆదిలోనే కాఫీ ప్రాజెక్టుకు గండికొడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
మాయమైన ‘మహాగణి’ మొక్కలు
కాఫీ మొక్కలకు నీడనిచ్చేందుకు గత ఏడాది పంపిణీ చేసిన మహాగణి మొక్కలు ప్రస్తుతం అక్కడక్కడ ఒకటి అర మాత్రమే కనిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారుల కనీస సిఫారసు లేకుండా నీడ, కలపనిచ్చే మహాగణి మొక్కలను అధికారులు గిరిజన రైతులకు పంపిణీ చేశారు. గతేడాది ఎకరానికి 450 సిల్వర్ ఓక్, 250 మహాగణి మొక్కలను పంపిణీ చేయడంతో రైతులు వాటిని నాటుకున్నారు. కాని మహాగణి మొక్కలు 80 శాతం చనిపోయాయని రైతులే చెబుతున్నారు. జీకేవీధి మండలం అద్ధరవీధిలో తన భూమిలో నాటుకున్న మహాగణి మొక్కల్లో కేవలం 20 శాతం మొక్కలు మాత్రమే బతికాయని జర్తా దారబాబు అనే రైతు తెలిపారు. ఇది ఉదాహరణ మాత్రమే, జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన మహాగణి మొక్కల పరిస్థితి ఇలానే ఉంది. ఇదిలా ఉండగా ఈఏడాది మొక్కల పంపిణీలో అధికారులు మరింత నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో రైతులకు పంపిణీ చేసిన సిల్వర్‌ఓక్, వెదురు మొక్కలు సైతం నాసిరకంగానే ఉన్నాయి. అధికారులు, సరఫరాదారులు కుమ్మక్కై మేలు జాతి మొక్కలు పంపిణీ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా కొత్త కాఫీ ప్రాజెక్టును నీరుగార్చి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. కాని కాఫీ రైతులకు అందించే మొక్కల విషయంలో ఇందుకు భిన్నంగా జరుగుతున్నది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ రకాల మొక్కల స్థితిగతులను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో నాసిరకం మొక్కలు పంపిణీ చేయడం, అవి చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఉన్నతాధికారులు మొక్కల పంపిణీని పట్టించుకోకపోవడంతో చని పోయిన మొక్కల స్థానే మరో మారు కొత్త మొక్కలు నాటించడం, వాటికి వేరుగా నిధులు వ్యయం చేయడం వంటివి జరుగుతాయి. దీనివల్ల అధికారులు, మొక్కలు పంపిణీ చేసే సరఫరాదారుడికి మేలు జరుగుతుంది. కాని మొక్కల పెంపకం ద్వారా జీవనోపాధి మెరుగుపర్చుకోవాలని ఆశించిన గిరిజన రైతులకు నష్టం కలగడంతోపాటు వారికి మేలు చేయాలనే ముఖ్యమంత్రి ఆశయం సైతం నెరవేరని పరిస్థితి నెలకొంటున్నది.
మొక్కల వ్యవహారంపై కలెక్టర్ మౌనమెందుకో?...
జిల్లా వ్యాప్తంగా మొక్కల పంపిణీపై తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు రావడంతోపాటు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలోని ఓ అధికారి సెల్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా జిల్లా పెద్దగా భావించే కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి జిల్లాలో ఏదైనా ప్రభుత్వ శాఖపై ఆరోపణలు వస్తే, వాస్తవాల నిర్ధారణకు, సంబంధీకులపై చర్యలు చేపట్టేందుకు అధికారులు విచారణ చేపడతారు. మొక్కల పంపిణీ వ్యవహారంలో అధికారులు, సరఫరాదారుల కుమ్మక్కు, రాష్ట్ర స్థాయిలో దానిపై ఫిర్యాదులు వెళ్లడం వంటివి జరుగుతున్నా కలెక్టర్ కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే అదనుగా జిల్లా నీటి యాజమాన్య సంస్థకు చెందిన అధికారులు సైతం తమ తప్పును కప్పిపుచ్చి, అక్రమాలు బయటకు రాకుండా శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఈక్రమంలో జిల్లాలో మొక్కల పంపిణీ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ చేపడితేనే అక్రమార్కులపై చర్యలు, గిరిజన రైతులకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.