Share News

తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా భారీ వర్ష సూచన..

ABN , Publish Date - Mar 15 , 2026 | 08:46 AM

Weather Updates: ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో..

తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా భారీ వర్ష సూచన..

Weather Updates: ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం సమయంలో చలి, 10 గంటలు దాటగానే తీవ్రమైన ఎండ.. సాయంత్రం కాగా మబ్బులు కమ్మేస్తూ విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.


దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఆయా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తాజా అంచనా ప్రకారం మార్చి 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే ఐదారు రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.


మధ్య, తూర్పు భారత రాష్ట్రాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ప్రకటించారు. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు. ఇక మార్చి 15 నుండి 20 వరకు జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో వర్షపాతం, హిమపాతం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో అనేక చోట్ల బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.


ఈశాన్య భారతదేశంలో కూడా వాతావరణం చురుగ్గా ఉంటుందని, రాబోయే ఐదారు రోజులు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మార్చి 15, 16 తేదీలలో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.


ఇక మార్చి 15 నుంచి 18వ తేదీల మధ్య పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురియనుందన్నారు. అలాగే బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు.


దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మార్చి 18, 19 తేదీల్లో పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.


Also Read:

యాదాద్రి జిల్లాలో భువనగిరిలో దారుణం.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి

హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మన ఎల్‌పీజీ నౌకలు!

రోహిత్ శర్మ బాటలో.. సూపర్ ఫిట్‌గా మారిన రిషభ్ పంత్

Updated Date - Mar 15 , 2026 | 08:51 AM