యూపీలోని బాందా జిల్లాలో వరుసగా మూడో రోజూ దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
ABN , Publish Date - May 21 , 2026 | 08:35 PM
ఉత్తర భారతంలో భానుడు కరాల నృత్యం చేస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాందా జిల్లా వరుసగా మూడో రోజు కూడా దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా నిలిచింది.
లక్నో, మే 21: కరాల నృత్యం చేస్తున్న భానుడు ఉత్తర భారతదేశాన్ని నిప్పుల కొలిమిగా మార్చేశాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ (UP) తీవ్రమైన వడగాల్పుల (Heatwave) గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. రాష్ట్రంలోని బాందా (Banda) జిల్లా వరుసగా మూడో రోజు కూడా దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా నిలిచింది. ఇవాళ (గురువారం) ఇక్కడ ఏకంగా 48.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఐఎండీ లక్నో సహా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
బాందా జిల్లాలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. స్థానికులు రోడ్డు పక్కన దొరికే చల్లటి శరబత్‌లు, మంచినీళ్లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఈ పరిస్థితిని స్థానికులు ‘అగ్నిపరీక్ష’గా అభివర్ణిస్తున్నారు.
బాందా జిల్లా కర్కట రేఖకు (Tropic of Cancer) సమీపంలో ఉండటం వల్ల నేరుగా సూర్యకిరణాలు పడటం, ఆకాశం నిర్మలంగా ఉండటం, తక్కువ తేమతో కూడిన పీఠభూమి ప్రాంతం కావడం, నదులు ఎండిపోవడం ప్రధాన కారణాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రోడ్ల విస్తరణ పేరుతో పాత పెద్ద చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం (Deforestation)ఇసుక, రాళ్ల మాఫియా సాగిస్తున్న అక్రమ మైనింగ్ వల్ల ఇక్కడి ఉష్ణోగ్రతలు ఇంత దారుణంగా పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్నో సివిల్ ఆసుపత్రిలో ‘కోల్డ్ రూమ్’ సదుపాయం
రాష్ట్ర రాజధాని లక్నోలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో, వడదెబ్బ (Heatstroke) బారిన పడే రోగుల కోసం అక్కడి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి అసాధారణ ముందస్తు ఏర్పాట్లు చేసింది.
వడదెబ్బ తగిలిన రోగుల శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించడానికి ఆసుపత్రిలో ప్రత్యేకంగా ‘కోల్డ్ రూమ్’ (Cold Room) ఏరియాను ఏర్పాటు చేశారు. ఇందులో నిరంతరం ఏసీలు నడిచే మూడు గదులను కేటాయించారు.
వడదెబ్బ రోగుల కోసమే ప్రత్యేకంగా 10 బెడ్ల వార్డును సిద్ధం చేశారు. ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, అవసరమైన మందులను భారీగా స్టాక్ ఉంచినట్లు ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపర్‌ఇంటెండెంట్ దేవేష్ చంద్ర పాండే తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇంకా తీవ్రమైన రోగులెవరూ రాలేదని ఆయన పేర్కొన్నారు.
ఎండల తీవ్రత వల్ల స్థానిక ఆసుపత్రులకు జ్వరం, కళ్ళు తిరగడం, వాంతులు, విరేచనాల వంటి సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా మెజిస్ట్రేట్ (DM) అమిత్ అసేరి స్పందిస్తూ.. జిల్లాలోని అన్ని ఆసుపత్రులను, అత్యవసర అంబులెన్స్ సేవలను హై-అలర్ట్‌లో ఉంచినట్లు తెలిపారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని కఠినమైన మార్గదర్శకాలను (Advisory) జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
Read Latest AP News And Telugu News