ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
ABN , Publish Date - Aug 06 , 2026 | 07:30 AM
పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అమరావతి, ఆగస్టు 06: పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు నెల్లూరు, తిరుపతిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని వివరించింది.
ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని అంది. దీంతో ఆ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించింది. నీటి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. మత్స్యకారులతోపాటు రైతులు వాతావరణ శాఖ జారీ చేసే సూచనలు తప్పక పాటించాలని చెప్పింది. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు చేపట్టాలని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది.