Share News

ఏపీలో విభిన్న వాతావరణం.. దంచికొడుతున్న ఎండలు, వానలు..

ABN , Publish Date - May 03 , 2026 | 07:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.

ఏపీలో విభిన్న వాతావరణం.. దంచికొడుతున్న ఎండలు, వానలు..
AP Weather Report

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు (ఆదివారం) నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 46.2°C డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని తెలిపింది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1°C డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యిందని పేర్కొంది.


అలాగే కంభం 45.7°C, బోనుపల్లి 45.6°C, నడిగడ్డ 44.2°C, కారంచేడు 44°C, తోవి 43.9°C డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మెుత్తం 16 జిల్లాల్లోని 286 మండలాల్లో నేడు 41°C డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వెల్లడించారు. కడప, నెల్లూరు జిల్లాల్లోని అత్యధిక మండలాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. మరోవైపు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు పడినట్లు అధికారులు తెలిపారు. ముమ్మిడివరంలో 72.7 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. కాట్రేనికోన 57.7 మి.మీ., పెద్దాపురం 50.2 మి.మీ., పిఠాపురం 45.5 మి.మీ. రికార్డు అయినట్లు వెల్లడించారు.


సోమవారం వాతావరణ పరిస్థితి..

మరోవైపు సోమవారం నాడు 27 మండలాలకు వడగాలుల హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. గుంటూరు, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో హీట్‌వేవ్ ప్రభావం అధికంగా ఉంటుందని, ప్రజలు ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం సహా పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిడుగులతో కూడిన వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని.. రైతులు, కూలీలు పొలాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన పీవీ సింధు

భద్రతా సిబ్బంది వైఫల్యం జరగలేదు: టీటీడీ క్లారిటీ..

Updated Date - May 03 , 2026 | 07:52 PM