వీల్‌చైర్ టూ విక్టరీ రూట్.. సైకిల్ రైడర్‌ను అభినందించిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్
ABN, Publish Date - Mar 10 , 2026 | 09:52 PM
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామానికి చెందిన 66 ఏళ్ల సైక్లిస్ట్ రావి రమేష్ బాబు.. పట్టుదల ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రమేష్‌బాబు గురించి తెలుసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్.. వీడియో కాల్‌లో మాట్లాడి, ఆయన్ను అభినందించారు..
వయస్సు ఆయనకు కేవలం సంఖ్య మాత్రమే. యువకులకూ సాధ్యం కాని సాహసాన్ని చేసి చూపించి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. మూడు సర్జరీలు జరగడంతో వైద్యులు అతన్ని జీవితాంతం వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపారు. అయినా ఆయన కుంగిపోలేదు. తనకిష్టమైన సైకిల్ రైడ్‌ను ఎంచుకుని ప్రస్తుతం దేశాన్నే చుట్టేస్తున్నాడు. పట్టుదల ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనే కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామానికి చెందిన రావి రమేష్ బాబు.
రమేష్‌బాబును అభినందించిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్
రమేష్‌బాబు గురించి తెలుసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్.. ఆయనతో ఆన్‌లైన్ కాల్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రమేష్ బాబు తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, వాటిని ఆయన ఎదుర్కొన్న తీరును, సైకిల్ రైడ్ విశేషాలను కోగంటి భాను ప్రకాష్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా కోగంటి భాను ప్రకాష్ మాట్లాడుతూ.. తాను కూడా రన్నర్, స్విమ్మర్, సైక్లిస్ట్ కావడంతో.. రమేష్ బాబు సక్సెస్ స్టోరీ ఇన్‌స్పైర్ కలిగించిందని, అందుకే ఆయన్ను అభినందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రమేష్ బాబును యువత ఆదర్శంగా తీసుకోవాలని కోగంటి భాను ప్రకాష్ సూచించారు. రమేష్ బాబు లైఫ్ స్టైల్‌ను పాటిస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లోనూ 90 నుంచి 100 ఏళ్ల వరకూ జీవించవచ్చని తెలిపారు. వీల్‌చైర్ టూ విక్టరీ రూట్.. అంటూ రావి రమేష్ బాబును కోగంటి భాను ప్రకాష్ అభినందించారు.
రావి రమేష్ బాబుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ముఖాముఖికి సంబంధించిన పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఎవరీ రమేష్ బాబు..
విజయవాడలో స్థిరపడిన 66 ఏళ్ల రావి రమేష్ బాబు సొంతూరు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామం. 2010లో తన 50వ ఏట జరిగిన ప్రమాదంలో ఆయనకు రెండు సార్లు మోకాళ్ల సర్జరీలు జరిగాయి. తర్వాత కొన్నాళ్లకే వెన్నుముక సర్జరీ కూడా జరిగింది. దీంతో నడవలేని స్థితిలోకి వెళ్లారు. బతికినన్నాళ్లూ ఆయన్ను వీల్‌చైర్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో స్నేహితుడు ఇచ్చిన ‘హీల్ ది బాడీ.. హీల్ ది మైండ్’.. అనే పుస్తకాన్ని చదివి తన మానసిక స్థితిని దృఢంగా మార్చుకున్నారు. ఎంతో శ్రమించి ఆరు నెలల వ్యవధిలో నడవడం నేర్చుకున్నాడు. తర్వాత ఏకంగా 40 కిలోమీటర్లు ఆగకుండా నడిచాడు.
నాలుగేళ్లలో శరీరాన్ని పూర్తి దృఢంగా మార్చుకుని విజయవాడ నుంచి తిరుపతికి కాలినడకన వెళ్లాడు. తనను తాను దృఢంగా మారడానికి ఎంచుకున్న సైకిల్‌పై.. దేశం మొత్తం చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే వయసు ఎక్కువ ఉండడంతో కొందరు తిరస్కరించారు. అయినా పట్టువదలకుండా చివరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌కు ఆడాక్స్ క్లబ్ నిర్వహించే ఫ్లెంచీ పోటీల్లో పాల్గొని తన కలను సాకారం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలను సైకిల్‌పై చుట్టేశాడు. దీంతోపాటూ 20,700 అడుగుల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను కూడా ట్రెక్ చేశాడు. రానున్న రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 4 వేల కిలోమీటర్ల సైకిల్ చేయాలనేదే తన సంకల్పమని రమేష్ బాబు చెబుతున్నారు.
Updated at - Mar 11 , 2026 | 06:24 PM