Share News

వంటిల్లు వెలగంగా..

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:55 PM

మనం మరచిపోయిన భారతీయ ఫల సంపద వెలగపండు! లోపల గుజ్జు పుల్లగానూ, తియ్యగానూ ఉండి విలక్షణమైన లక్షణాలు వెలగకున్నాయి. పుల్లగా ఉన్నప్పటికీ పులుపు వలన కలిగే ఎసిడిటీ లాంటి అనర్థాలను తగ్గిస్తుంది.

వంటిల్లు వెలగంగా..

ఏనుగులకు ఇష్టమైనదని ఎలిఫెంట్‌ యాపిల్‌, కోతులకు ఇష్టమైనదని మంకీ యాపిల్‌, రాయిలా ఉంటుందని స్టోన్‌యాపిల్‌, చెక్కలా ఉంటుందని వుడ్‌ యాపిల్‌ - ఇలా వెలగపండుకు ఇతర భాషల్లో పేర్లున్నాయి. వెల్‌ అంటే గొప్ప రక్షణకవచం కలిగినదనే అర్థంలో తెలుగులో వెలగ అన్నారు. తెలుగు భాషలో పేర్లు శాస్త్రీయంగా ఉంటాయి. మంకీ యాపిల్‌ అనటం కన్నా వెలగ అనటంలో అందం, ఆనందం రెండూ ఉన్నాయి. కపిత్థా కార భూగోళం అంటే సంస్కృతంలో భూమి వెలగపండులా గుండ్రంగా ఉంటుందని!

మనం మరచిపోయిన భారతీయ ఫల సంపద వెలగపండు! లోపల గుజ్జు పుల్లగానూ, తియ్యగానూ ఉండి విలక్షణమైన లక్షణాలు వెలగకున్నాయి. పుల్లగా ఉన్నప్పటికీ పులుపు వలన కలిగే ఎసిడిటీ లాంటి అనర్థాలను తగ్గిస్తుంది. తీపి వలన కలిగే షుగరు స్థూల కాయం లాంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది. గుజ్జు అనే మాట వెలగ గుజ్జుకే వర్తించేది. క్రమేణా పండ్లరసాలన్నింటినీ గుజ్జు అనటం అలవాటయ్యింది.


ఏనుగు వెలగపండును నమలకుండా మింగేస్తే, లోపలి గుజ్జు జీర్ణమై కాయ యథాత థంగా బయటకు వస్తుందనీ ‘కరిమింగిన వెలగపండు’ అనే సామెత ఏర్పడిందంటారు. కానీ, ఇక్కడ ‘కరిమింగడం’ అంటే, వెలగపండు లోపల గుజ్జుకు బొగ్గుపొడిలా పట్టిన నల్లని తెగులు అని అర్థం! పచ్చి వెలక్కాయనునేరుగా తింటే గొంతు బొంగురుపోయి మంట అనిపిం చటాన్ని బట్టి ‘గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు’ అనే సామెత పుట్టింది. వెలగ పండే అన్ని విధాలా మంచిది.

వెలగ పండు పండినకొద్దీ గుజ్జులో బీటా కెరోటిన్‌ (క్యారెట్లలో ఉండే రసాయనం) ఏర్పడు తుంది. ఇది కంటిచూపునకు ఎంతో మేలు చేస్తుంది. పోషక విలువల పరంగా వెలగ పండు ఒక సంపూర్ణ ఆహారం. వంద గ్రాముల గుజ్జు సుమారు 140 క్యాలరీలు ఇస్తుంది. పిండిపదార్థాలు, ప్రోటీన్లు, బీ-కాంప్లెక్స్‌, సి విటమిన్‌, టానిన్‌లు సమృద్ధిగా ఉంటాయి.


book8.3.jpgవెలగ ఆకుల రసం జీర్ణశక్తిని పెంచుతుంది. పేగులను బలపరుస్తుంది. కామెర్ల వంటి వ్యాధుల్లో ఉపశమనం ఇస్తుంది. వెలగపండు లివర్‌, గుండె, పేగులకు టానిక్‌లా పనిచేస్తుం దని ఆయుర్వేదం చెబుతుంది. విరేచనాలను నియంత్రిస్తుంది. కలరా, అమీబియాసిస్‌ వంటి వ్యాధుల్లో ఇది విశ్వసనీయమైన ఔషధం. శరీరంలోని విషదోషాలను తగ్గించే గుణం కలిగినది. అలెర్జీ, ఉబ్బసం, దగ్గు వంటి సమస్యలున్నవారు వెలగను తరచుగా వాడితే చిన్న కారణానికే పెద్ద ప్రతిక్రియలు రాకుండా నివారించవచ్చు. రక్తస్రావాన్ని నియంత్రించే లక్షణం వల్ల మొలలు, అధిక రక్తస్రావ సమస్యల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది.


తీపి కలిపి పానకం లాగా చేసి, మిరియాల పొడి, జీలకర్ర కలిపి తాగితే వెలగ పానకం ఎంతో రుచికరం. దీని గుజ్జులో నీళ్లు కలిపి పులవబెట్టి తయారుచేసే తరవాణి ఒకప్పుడు తెలుగువారి ముచ్చట! ఆగకుండా వచ్చే ఎక్కిళ్లకు పెరుగుతో కలిపిన వెలగగుజ్జు మంచి మందుగా పనిచేస్తుంది. గొంతులో మంట, చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతాయి.

కొబ్బరిపాలు, పెరుగు లేదా సుగంధ ద్రవ్యా లతో వెలగ పండుకూర, పప్పు, పులుసు, పచ్చడి, జామ్‌ లాంటివి వండుకుంటారు. వెల గపండు గుజ్జులో పెరుగు కలిపి తాలింపు పెట్టిన పెరుగు పచ్చడి అద్భుతమైన ప్రోబయాటిక్‌ ఔషధం.

వెలగ చెట్టుకి తుమ్మజిగురు లాగే మెత్తని జిగురు వస్తుంది. జిగురు మధుమేహంపై చూపే ప్రభావంపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఔషధంగా మాత్రమే కాదు, రుచికరమైన సంపూర్ణ ఆహారంగా కూడా వెలగపండును మన జీవనశైలిలో మళ్లీ స్థానం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది.

డా. జి వి పూర్ణచందు, 94401 72642


పావ్‌భాజీ దోశ

కావలసిన పదార్థాలు: దోశపిండి-కప్పు, ఉల్లి ముక్కలు-అర కప్పు, క్యాప్సికమ్‌, టమాటా ముక్కలు - కప్పు, ఉడికించిన బఠానీ, ఆలు, క్యాలీఫ్లవర్‌ ముక్కలు - అర కప్పు, టమాటా సాస్‌- ఆరు స్పూన్లు,చిల్లీ సాస్‌ - ఆరు స్పూన్లు, పావ్‌భాజీ మసాలా పౌడర్‌ - ఒకటిన్నర స్పూను, బటర్‌-మూడు స్పూన్లు, కొత్తిమీరతరుగు - రెండు స్పూన్లు, కొబ్టరి చట్నీ - మూడు స్పూన్లు,నూనె, ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం: పెనాన్ని వేడి చేసి కాస్త నూనె వేసి దోశ వేయాలి. దీని మీద ఉల్లి, టమాటా, క్యాప్సికమ్‌ ముక్కలు వేయాలి. ఇంకా ఉడికించిన కూరగాయలు కొన్ని వేయాలి. పైన టమాటా సాస్‌, కొబ్బరి చట్నీ, చిల్లీ సాస్‌ వేసి మొత్తం పూయాలి. భాజీ మసాలా పౌడర్‌, ఉప్పు చేర్చాలి. పైన బటర్‌ వేసి కాస్త దోరగా కాల్చాలి. పైన ఉల్లి ముక్కలు, కొత్తిమీర తరుగు వేస్తే పావ్‌భాజీ దోశ తయారు. కొబ్బరి చట్నీతో ఈ దోశ భలే రుచిగా ఉంటుంది.


దాల్‌ మహారాణి

కావలసిన పదార్థాలు: పొట్టు మినప్పప్పు- ముప్పావు కప్పు, రాజ్మా-పావు కప్పు,శనగ పప్పు-రెండు స్పూన్లు, అల్లం-ఇంచు, వెల్లుల్లి రెబ్బలు-అయిదు, కారం- అర స్పూను, పసుపు-అర స్పూను, బటర్‌-స్పూను, లవంగాలు-అయిదు, జీలకర్ర- స్పూను, దాల్చిన చెక్క-ఇంచు, పసుపు-అర స్పూను, ధనియాల పొడి-అర స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు -స్పూను, ఇంగువ-చిటికెడు, టమాటా, ఉల్లి ముక్కలు- కప్పు, కొత్తిమీర తరుగు-రెండు స్పూన్లు, కసూరీ మేతీ - రెండు స్పూన్లు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: పొట్టు మినప్పప్పు, రాజ్మాను అయిదు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరవాత ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. ఇందులో శనగలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కారం, పసుపు, ఉప్పు, నూనె, మూడు గ్లాసుల నీళ్లు జతచేసి ఆరు విజిల్స్‌ తరవాత కుక్కర్‌ కట్టేయాలి. ఓ బాణలిలో రెండు స్పూన్ల నూనె, బటర్‌ వేసి, అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేయించాలి. నిమిషం తరవాత ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు కలపాలి. కాస్త రంగు మారాక టమాటా ముక్కలు జతచేయాలి. టమాటా దగ్గరవుతుంటే ఉడికించిన పప్పును వేసి, బాగా కలిపి పదిహేను నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. ఆ తరవాత పైన కొత్తిమీర, కసూరీ మేతీ, కాస్త బటర్‌ వేస్తే సరి.


ఈ వార్తలు కూడా చదవండి.

చిల్లర పనులకు రాలేదు

అమరావతిని అడ్డుకోలేరు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2026 | 12:55 PM