‘పీచు’లోనే పరమార్థం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:33 PM
క్యారెట్, చిలగడదుంప, కంద.. దేని ప్రత్యేకత దానిదే అయినప్పటికీ, ఇవన్నీ సమాన గుణ ధర్మాలు కలిగినవే. వీటిలో బీటా కెరోటిన్ (విటమిన్-ఎ) మన శరీరానికి కావాల్సిన దానికన్నా నాలుగు రెట్లు అధికంగా లభిస్తుంది.
మన వంటగదిపై అమెరికన్ ప్రభావానికి చిలగడదుంప ఒక సాక్ష్యం. దారి తప్పిన కొలంబస్ అమెరికా చేరటం వలన మిరప, టమాటా, ఆలుగడ్డలతో పాటు చిలగడ దుంపలు మొదట యూరోప్‌ని, చివరికి మనల్ని చేరాయి. కొత్తవి రాగానే, కంద, పెండలం, గుమ్మడి, బూడిదగుమ్మడి లాంటి రుషులు తిని బతికిన కూరగాయల్ని టీవీ రాగానే రేడియో వదిలేసినట్టు వదిలేశాం.
అమెరికాలో ‘బటాటా’ అని పిలవటాన్నిబట్టి యూరోపియన్లు మొదట చిలగడదుంపనే పొటాటో అన్నారు. షేక్స్‌పియర్ ‘పొటాటో’ అన్నది చిలగడదుంపనే! క్రమేణా యూరప్‌లో ఆలుగడ్డల ప్రాముఖ్యత పెరిగాక, వాటిని ‘పొటాటో’ అని, దీన్ని ‘స్వీట్ పొటాటో’ అని పిలవటం మొదలుపెట్టారు. కందగడ్డ కన్నా చిన్నవి కాబట్టి చిరుగడ్డ-చిరుగడ- చిలగడ దుంపలనీ, గెనుసుగడ్డ, ఆళ్వారుగడ్డ, మేహనదుంప, మోహన దుంప అనీ పిలిచారు మనవాళ్లు!
క్యారెట్, చిలగడదుంప, కంద.. దేని ప్రత్యేకత దానిదే అయినప్పటికీ, ఇవన్నీ సమాన గుణ ధర్మాలు కలిగినవే. వీటిలో బీటా కెరోటిన్ (విటమిన్-ఎ) మన శరీరానికి కావాల్సిన దానికన్నా నాలుగు రెట్లు అధికంగా లభిస్తుంది. కాబట్టి, ఒకదాని కోసం ఇంకో దాన్ని వదులుకో కుండా అవకాశాన్నిబట్టి అన్నీ తింటూఉండాలి! బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటంతో క్యారెట్ లాగే ఇది శరీరంలో విషదోషాలను తొలగించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ‘ఇ’ వలన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.
చిలగడదుంపలో సుమారు 100 క్యాలరీల శక్తి, విటమిన్ ‘ఎ, విటమిన్ ‘ఇ’, విటమిన్ ‘సి’, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియంలతో పాటు ఆహార పీచుపదార్థం (డయటరీ ఫైబర్) తక్కిన వాటికన్నా దండిగా దొరుకుతాయి. ఈ దుంపలోని మొత్తం ఫైబర్‌లో 75ు అరగని ఫైబర్ ఉంటుంది. ఈ ‘అరగని ఫైబర్’ పేగుల్ని బలసంపన్నం చేసి, విరేచనం అయ్యేలా చేస్తుంది. తక్కిన 25ు అరిగే ఫైబర్ పెక్టిన్ రూపంలో ఉంటుంది. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తుంది. అన్నం తిన్న తృప్తి కలిగిస్తుంది. తొక్కతో సహా 100 గ్రాముల చిలగడదుంపలో 3.0 గ్రాముల కన్నా ఎక్కువగానే ఫైబర్ ఉంటుంది. ఇది ఒక రోజుకు మనిషికి కావలసిన ఫైబర్లో 15ు వరకూ ఉంటుంది. ఈ మొత్తంలో కేవలం తొక్కు ద్వారానే 20-25ు అరగని పీచు ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకూ ఇతర కాయగూరలతోనూ, ఆకు కూరలతోనూ కలగలపుగా చిలగడ దుంపల్ని కలిపి వండు కుంటే రోజువారీగా మనశరీరానికి అందవలసిన ఫైబరు అందుతుంది.
అతిగా ఉడికించకుండా, తక్కువ వేడి మీద, తొక్కతోసహా వండితే అందులోని పోషకాలు నశించవు. సలాడ్ రూపంలో పచ్చిగా తీసు కుంటే విటమిన్ ‘సి’ పరిపూర్ణంగా అందు తుంది. బంగాళా దుంపలతోనూ, కందతోనూ వండుకునేవన్నీ చిలగడ దుంపలతో కూడా కమ్మగా ఉంటాయి. కంద-బచ్చలి కూరలాగే చిలగడ దుంపని ఏదైన ఆకుకూరతో కలిపి వండితే మంచిది. పొయ్యి మీంచి దించి కొద్దిగా చల్లారాక చిటికెడు ఆవపిండి కలిపితే ఘాటైన పరిమిళంతో పాటు తేలికగా అరుగుతుంది.
షుగరుని పెంచే గుణం ఆలూ దుంపల్లో 90శాతం ఉంటే, చిలగడ దుంపల్లో 60ుమాత్రమే ఉంటుంది. చిలగడ దుంపల్లో అరిగే పీచు ఎక్కువగా ఉండటాన షుగరు రక్తంలోకి చేరే ప్రక్రియని నిదానం చేస్తాయి. ఏ విధంగా చూసినా ఆలూ దుంపలకన్నా చిలగడ దుంపలే ఎక్కువ ఆరోగ్యదాయకం. మధుమేహం ఉన్నవారు ఆలూని పరిమితంగా, చిలగడను తక్కువగానూ తీసుకోవచ్చు!
డా. జి వి పూర్ణచందు, 94401 72642
థేచా పనీర్ టిక్కా
కావలసిన పదార్థాలు: పనీర్-12 ముక్కలు, కొత్తి మీర - ఓ కట్ట, వెల్లుల్లి రెబ్బలు-పది, ఎండు మిర్చి - అయిదు, నూనె-తగినంత, అల్లం-చిన్న ముక్క, పల్లీలు- పావు కప్పు, జీలకర్ర-స్పూను, ఉప్పు- స్పూను.
తయారుచేసే విధానం: ఓ బాణలిలో కాస్త నూనె వేసి అందులో జీలకర్ర, పల్లీలు, మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేయించాలి. కాస్త ఘుమఘుమలా డుతుంటే కొత్తిమీరనూ చేర్చాలి. కొత్తిమీర దగ్గరవుతుంటే స్టవ్ కట్టేయాలి. అంతా చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మసాలానే థేచాగా పిలుస్తారు. ఇప్పుడు పన్నెండు పనీర్ ముక్కలకి థేచాను పూసి అరగంట మూత మూసి పెడితే థేచా పనీర్ టిక్కా తయారు.
బేబీ కార్న్ మంచూరియా
కావలసిన పదార్థాలు: బేబీ కార్న్-250 గ్రాములు, మైదా-అర కప్పు, మొక్కజొన్న పొడి-నాలుగు స్పూన్లు, కారం - అర స్పూను, ఉప్పు - కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్టు- స్పూను, లవంగాలు -4, ఉల్లికాడలు - రెండు, పచ్చి మిర్చి- రెండు ఉల్లి. క్యాప్సికమ్ ముక్కలు-కప్పు, టమాటా సాస్-రెండు స్పూన్లు, సోయా సాస్-రెండు స్పూన్లు, చిల్లీ సాస్-రెండు స్పూన్లు, వెనిగర్-రెండు స్పూన్లు, కారం- పావు స్పూను, మిరియాల పొడి-పావు స్పూను, చక్కెర-పావు స్పూను, నీళ్లు, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: బేబీకార్న్‌ను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇందులో మిరియాల పొడి, పావు స్పూను ఉప్పు, రెండు స్పూన్ల మొక్కజొన్న పొడి జతచేయాలి. బాణలిలో నూనె వేసి బేబీకార్న్‌ను దోరగా వేయించి, పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి అల్లం, పచ్చిమిర్చి ముక్కల్ని వేయించాలి. వెల్లుల్లి పేస్టునూ కలపాలి. ఉల్లికాడలు, ఉల్లి, క్యాప్సికమ్‌ముక్కలూ జతచేయాలి. రెండు నిమిషాల తరవాత టమాటా కెచప్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి అంతా కలపాలి. నిమిషం తరవాత రెండు కప్పుల నీళ్లు జతచేయాలి. నీళ్లు మరుగుతుంటే మొక్క జొన్న పిండి వేసి కలపాలి. అంతా దగ్గరవుతుంటే ఉప్పు, చక్కెర చేర్చాలి. వేయించిన బేబీ కార్న్ ముక్కలూ జతచేస్తే మంచూరియా తయారు. ఆఖరున వెనిగర్ కలిపితే సరి.
ఈ వార్తలు కూడా చదవండి.
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News