మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో విషాదం.. కట్లపాముతో ఆటలాడాడు.. చివరకు..
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:11 PM
పాముతో ఆటలాడిన ఓ యువ వ్యాపారవేత్త.. చివరికి మృత్యువాతపడ్డాడు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన విషసర్పాన్ని చేతులతో పట్టుకుని స్నేహితుల ముందు ఆటలాడాడు. చివరకు పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రంగారెడ్డి, జూన్ 20: పాముతో ఆటలాడిన ఓ యువ వ్యాపారవేత్త.. చివరికి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్ మొహిద్దీన్ హుస్సేని (30) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతను తన స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. తెల్లవారుజామున ఒక చిన్న కట్లపాము ఫామ్‌హౌస్ లోపలికి వచ్చింది. ఆ పామును చూసిన సయ్యద్ మొహిద్దీన్.. అది చాలా చిన్నగా ఉండడంతో తనను ఏమీ చేయదని భావించాడు. స్నేహితులను భయపెట్టాలనే ఉద్దేశంతో ఆ విషసరపాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చేతులతో పట్టుకుని అందరినీ ఆటపట్టించాడు. ఈ క్రమంలో ఆ కట్లపాము ఒక్కసారిగా సయ్యద్ కుడిచేతిపై కాటేసింది.
పాము కాటు వేసినప్పటికీ తనకు ఏమీ కాదులే అంటూ నవ్వుతూ తేలికగా తీసుకున్నాడు. అయితే, కట్లపాము విషం అత్యంత ప్రమాదకరమైనది కావడంతో.. కాసేపటికే అతని శరీరంలో మార్పులు మొదలయ్యాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో స్నేహితులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై పోలీసలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి అచ్చెన్నాయుడు
‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ పేరుతో యోగా దినోత్సవం: రామ్‌దేవ్ బాబా
Read Latest AP News And Telugu News