Share News

భర్త, అత్తకు భోజనంలో విషం!

ABN , Publish Date - Aug 04 , 2026 | 07:34 AM

కట్టుకున్న భర్తను, అతడి తల్లి (అత్త)ని చంపేసేందుకు భోజనంలో విషం పెట్టిందో ఇల్లాలు. తన వివాహేతర బంధానికి ఆ ఇద్దరూ అడ్డుగా ఉన్నారని భావించే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

భర్త, అత్తకు భోజనంలో విషం!
Nizamabad Crime

  • ఇద్దరిపైనా హత్యాయత్నం చేసిన ఇల్లాలు

  • తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నారనే

  • సకాలంలో చికిత్స అందడంతో ఇద్దరూ క్షేమం

  • నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌లో ఘటన


మోపాల్‌ (ఆంధ్రజ్యోతి): కట్టుకున్న భర్తను, అతడి తల్లి (అత్త)ని చంపేసేందుకు భోజనంలో విషం పెట్టిందో ఇల్లాలు. తన వివాహేతర బంధానికి ఆ ఇద్దరూ అడ్డుగా ఉన్నారని భావించే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితురాలు ముదక్‌పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల సోనీ! భర్త భూమన్న అలియాస్‌ భూమయ్య, అత్త భూదేవవ్వ తన వివాహేత అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని సోనీ భావించింది. ఈనెల 1న ఇంట్లో వండిన మీల్‌ మేకర్‌ కూరలో సోనీ గడ్డి మందు కలిపినట్లు ఆరోపణలున్నాయి. మధ్యాహ్నం అత్త భూదేవవ్వ ఆ కూరతో భోజనం చేసింది. కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర వాంతులు, విరేచనాలయ్యాయి. భర్త భూమన్న అదే కూర తినే సమయంలో పురుగుమందు వాసన రావడంతో అనుమానమొచ్చి వెంటనే ఆ భోజనాన్ని పక్కనబెట్టాడు. అయినా అతడు కూడా అస్వస్థతకు గురవ్వడంతో ఇద్దరినీ వెంటనే నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మోపాల్‌ పోలీసులు నిందితురాలు సోనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మోపాల్‌ ఎస్సై సుష్మిత వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు

సహజీవనం జంటలకూ గృహహింస చట్టం

Updated Date - Aug 04 , 2026 | 07:34 AM