Share News

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..

ABN , Publish Date - May 17 , 2026 | 03:37 PM

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని పౌర హక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివాసీల చరిత్ర అంతా పోరాటమయం అని చెప్పారు.

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..
Professor Haragopal

హనుమకొండ: భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని పౌర హక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివాసీల చరిత్ర అంతా పోరాటమయం అని చెప్పారు. అడవులను కాపాడేందుకు వారు ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.


హనుమకొండలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఐక్యత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, ఆదివాసీ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్, ఆదివాసీ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. ఆదివాసీల పట్ల పాలకులు వివక్ష చూపుతున్నారని అన్నారు. అభివృద్ధి కంటే అణచివేతనే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి హామీలు ఇచ్చారే కానీ, పాలకులు ఏనాడూ వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. అటవీ సంపదను దోచుకుపోతున్న వారే తప్ప, ఆదివాసీలకు భరోసా ఇచ్చే వారు లేకుండా పోతున్నారని చెప్పారు.


ఖనిజ సంపదను తరలించుకుపోతున్నారే కానీ, అడవి బిడ్డల అభ్యున్నతిని విస్మరిస్తున్నారని హరగోపాల్ మండిపడ్డారు. పెట్టుబడిదారులకు పాలకులు కొమ్ముకాస్తున్నారని, ఆదివాసీలను అణచివేతకు గురిచేస్తున్నారని ఆగ్రహించారు. ఆదివాసీలందరూ ఎలాంటి స్వార్థం లేని వారని, అందుకే అడవులు అంతరించిపోకుండా కాపాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఆదివాసీలు అందరూ సంఘటితమై పాలకులను నిలదీయాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

భగీరథ్ లొంగిపోయారు.. విచారణ రాష్ట్ర పోలీసుల పరిధిలోనే ఉంది: కిషన్‌రెడ్డి

సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.. కిషన్‌రెడ్డి ధ్వజం

Updated Date - May 17 , 2026 | 03:59 PM