హరీశ్ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు మాజీ మంత్రి
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:06 PM
హనుమకొండ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎన్జీవోలు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
హనుమకొండ, ఆగస్టు 27: జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎన్జీవోలు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ వాహనం ఎక్కేందుకు మాజీ మంత్రి నిరాకరించారు. కాలినడకనే పోలీస్‌స్టేషన్ వెళ్లారు. కలెక్టరేట్ నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్ వరకూ హరీశ్ రావు కాలినడకన వెళ్లారు. మాజీ మంత్రి అరెస్ట్‌కు నిరసనగా సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణులు బైఠాయించారు. మాజీ మంత్రిని వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఉద్యోగులతో పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే 15 శాతం కమిషన్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మెరుగైన PRC ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి భట్టిని కలవాలంటే సెల్‌ఫోన్ కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు. రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసింది ఆరోపించారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నాయకులను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని, ఉద్యోగులతో పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదని హెచ్చరించారు.
టీఎన్జీవో యూనియన్ రాష్ట్ర నాయకులు ఎవరైనా మాట్లాడితే విజిలెన్స్, ఏసీబీ కేసులు పెట్టి ఉద్యోగ సంఘాలను రేవంత్ సర్కార్ బ్లాక్ మెయిల్ చేస్తోందని హరీశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయని.. అందుకే ఉద్యోగులతో పెట్టుకుంటున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తరఫున గళం వినిపిస్తామని చెప్పారు. ఉద్యోగుల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్
Read Latest Telangana News And Telugu News