Share News

ఎల్‌నినో ఎఫెక్ట్‌ ‘జై శ్రీరాం’ రకం ధర ‘ఆల్‌టైం’ రికార్డు

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:29 AM

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాభావ పరిస్థితులు.. వర్షాలు కురవక కరువు నెలకొన్న నేపథ్యంలో అన్ని రకాల పంటల ధరలు బహిరంగ మార్కెట్‌లో భగ్గుమంటున్నాయి.

ఎల్‌నినో ఎఫెక్ట్‌ ‘జై శ్రీరాం’ రకం ధర ‘ఆల్‌టైం’ రికార్డు
Jai Sriram paddy price

  • కేసముద్రంలో రూ.5,000 దాటిన క్వింటాల్‌ ధాన్యం

  • జైశ్రీరాం పాత రకం ధర రూ.రూ.5,016

కేసముద్రం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాభావ పరిస్థితులు.. వర్షాలు కురవక కరువు నెలకొన్న నేపథ్యంలో అన్ని రకాల పంటల ధరలు బహిరంగ మార్కెట్‌లో భగ్గుమంటున్నాయి. ప్రత్యేకించి నీటి ఆధార పంట వరి ధాన్యం ధరలు పైపైకి దూసుకెళ్లాయి. అందులోనూ వరి ధాన్యం రాష్ట్ర స్థాయిలోనే ఆల్‌టైం రికార్డు ధర పలికింది. ఇందుకు మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ వేదికైంది. అతి సన్న రకం జైశ్రీరాం ధాన్యం క్వింటాల్‌ ధర రూ.5,000 మార్కును దాటి.. రూ.5,016 పలికింది. శుక్రవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు ఓ రైతు ఐదు బస్తాల్లో పాతరకం ‘జైశ్రీరాం’ ధాన్యం, మరో ఐదుగురు రైతులు 57 బస్తాల్లో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం తీసుకొచ్చారు.


ఎలకా్ట్రనిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధానంలో జరిగిన ‘ఈ-వేలం’లో జైశ్రీరాం రకం ధాన్యం ధర క్వింటాల్‌కు రూ. 5016గా నమోదైంది. ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.4782, కనిష్ఠంగా రూ.4089 పలికింది. సగటున రూ.4,279 ధరల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇదే మార్కెట్లో గత నెలలో ఇదే రోజు ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం గరిష్ఠ ధర రూ.3,500 కాగా, సగటు ధర రూ.3,350-రూ.3380 మధ్య పలికింది. అటుపై క్రమంగా పెరుగు తూ వచ్చిన ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం ధర సగటున రూ.4200కు చేరుకుంది. ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.2461 (సన్నాలు), రూ.2441 (దొడ్డు) కాగా, మార్కెట్‌లో అంతకు రెట్టింపు ధరలు పలకడం గమనార్హం. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలోని బ్రాండెడ్‌ బియ్యం కంపెనీలు.. స్థానిక వ్యాపారుల ద్వారా భారీగా ధాన్యం కొనుగోలు చేసి స్టాక్‌ చేసుకుంటున్నాయని చెబుతున్నారు. తత్ఫలితంగానే మార్కెట్‌లో క్వింటాల్‌ ధాన్యం ధరలు రూ.5,000 మార్కును దాటాయని వ్యాపారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 06:29 AM