వికారాబాద్‌లో కలకలం.. ఆముదం కాయలు తిని విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Nov 17 , 2026 | 07:49 PM
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం ఇంబ్రహీంపూర్ తాండాలోని పాఠశాలలో కలకలం చోటుచేసుకుంది. అడవి ఆముదం కాయలను తినడంతో పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
వికారాబాద్, నవంబరు 17: జిల్లాలోని పరిగి మండలం ఇంబ్రహీంపూర్ తాండాలోని పాఠశాలలో కలకలం చోటుచేసుకుంది. అడవి ఆముదం కాయలను తినడంతో పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో సాయంత్రం విరామ సమయంలో ఓ బాలిక బయటకు వెళ్లి ఆముదం కాయలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వాటిని బాదం కాయలుగా భావించి తోటి విద్యార్థులకు పంచడంతో వారు తిన్నట్లు సమాచారం. కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై అస్వస్థతకు గురైన విద్యార్థులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
భావన అనే రెండో తరగతి విద్యార్థినికి వాంతులు.. విరేచనాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు వెల్లడించారు. మరోవైపు పాఠశాలలో మూత్రశాలలు లేకపోవడం వల్లే విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎంఈఓ అంజయ్య స్పందించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!