AIతో చిరుత ఫొటో.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వ్యక్తి అరెస్ట్
ABN , Publish Date - Oct 27 , 2026 | 08:14 AM
హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టించిన నకిలీ చిరుత ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 27: నగరంలోని ఉప్పల్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టించిన నకిలీ చిరుత ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫతుల్లాగూడ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందంటూ సదరు వ్యక్తి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిజంగానే చిరుత జనావాసాల్లోకి వచ్చిందని భావించిన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం వ్యాప్తి చెందడంతో అటవీ శాఖ అధికారులు, నాగోల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంపై వచ్చిన సమాచారాన్ని పరిశీలించి, అది నకిలీ ఫొటోతో చేసిన తప్పుడు ప్రచారమని గుర్తించినట్లు తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో నకిలీ ఫొటోను ప్రచారం చేసిన వ్యక్తిని కర్ణాటకకు చెందిన సచిన్‌గా గుర్తించారు. AI సాంకేతికతను ఉపయోగించి చిరుత ఫొటోను సృష్టించి, వాస్తవ ఘటనగా నమ్మించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు గుర్తించారు. దీంతో సచిన్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఎలాంటి సమాచారమైనా నిజానిజాలు నిర్ధారించుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని సూచించారు. ముఖ్యంగా AIతో రూపొందించిన నకిలీ ఫొటోలు, వీడియోలను నిజమైన ఘటనలుగా ప్రచారం చేస్తే ప్రజల్లో అనవసర భయాందోళనలు ఏర్పడతాయని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News