Share News

తుమ్మిడిహెట్టి 150 మీటర్లు

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:54 AM

తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

తుమ్మిడిహెట్టి 150 మీటర్లు

  • మహారాష్ట్రలో ముంపు లేకుండా బ్యారేజీ నిర్మాణం

  • నేరుగా ఎల్లంపల్లికి గ్రావిటీతో 100 టీఎంసీల జలాలు

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనుమతి ఇప్పించాలి

  • ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • కిషన్‌రెడ్డిని కలిసి కోరాలని మంత్రి ఉత్తమ్‌కు ఆదేశం

  • తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటి తరలింపునకు 4 ప్రత్యామ్నాయాలు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 152 మీటర్ల ఎత్తుతో కడితే మహారాష్ట్రలో ముంపు ఉంటుందని, మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఆ ముంపు ఉండదని అధికారులు సీఎంకు తెలిపారు. పైగా, 100 టీఎంసీల గోదావరి జలాలను గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లికి తరలించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ బ్యారేజీకి అనుమతి సాధించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నుంచి సహకారం తీసుకోవాలన్నారు. ఇందుకోసం కిషన్‌రెడ్డికి లేఖ ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. బుధవారం ఎంసీఆర్‌హెచ్చార్డీలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్‌, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఎంత ఎత్తుతో కడితే ఏ మేరకు నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుందనే దానిపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 149.50 మీటర్ల ఎత్తుతో కడితే 108.58 టీఎంసీల మేర నీటిని తరలించవచ్చని, 150 మీటర్ల ఎత్తుతో కడితే 129.23 టీఎంసీల దాకా తరలించే వీలుంటుందని వివరించారు. దాంతో సీఎం స్పందిస్తూ.. 148 మీటర్ల ఎత్తు విషయంలో మహారాష్ట్ర ఇదివరకే అంగీకారం తెలిపినందున మళ్లీ సంప్రదింపులు చేయాల్సిన అవసరం లేదన్నారు. 148 మీటర్ల ఎత్తుతో కట్టినా, 150 మీటర్ల ఎత్తుతోనైనా ముంపులో తేడా ఉండదని అధికారులు గుర్తు చేయగా... 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టడానికి అవసరమైన కసరత్తు చేపట్టాలని ఆదేశించారు.


కాగా, 148, 150, 152 మీటర్ల వద్ద ముంపుపై పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) ఇప్పటికే అధ్యయనాలు కూడా చేసిందని అధికారులు సీఎంకు తెలిపారు. 148 మీటర్లతో నిర్మించినా, 150 మీటర్లతోనైనా.. ముంపు 300 ఎకరాల్లోపే ఉంటుందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగిందని చెప్పారు. 71.5 కిలోమీటర్ల కెనాల్‌ నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని తరలించి, వినియోగించుకునే అవకాశాలు ఉంటాయన్నారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణం చేపడితే ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు రాష్ట్రంలో మెట్ట ప్రాంతాల రైతులకు సాగునీరు, తాగునీరు అందుతుందని, తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తెచ్చుకునే వీలుంటుందని సీఎం చెప్పారు. దీనిపై మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున.. ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సూచించారు. గురువారం కిషన్‌రెడ్డిని నేరుగా కలిసి.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిందిగా కోరాలన్నారు.


కాళేశ్వరం పరీక్షల్లో వేగం పెంచాలి..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేసే ప్రక్రియలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వానాకాలం లోపు పరీక్షలన్నీ పూర్తిచేసి, ఫలితాలను పునరుద్ధరణ డిజైన్ల బాధ్యత తీసుకున్న సంస్థకు అందించి, అవసర మైన డిజైన్లు సిద్ధం చేయించాలని అన్నారు. ఆ తర్వాత డిజైన్లకు ఎన్‌డీఎ్‌సఏ, సీడబ్ల్యూసీ ఆమోదం తీసుకొని పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించడానికి నాలుగు ప్రత్యామ్నాయ మార్గాలు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆర్వీ అసోసియేట్స్‌, ఐఐటీ హైదరాబాద్‌ సంస్థలు అధ్యయనం జరిపి ఈ మేరకు ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయన్నారు. ఏ ప్రత్యామ్నాయ మార్గంతో వెళ్తే ఎంత ఖర్చు అవుతుందనే దానితోపాటు ఇతర అనుకూల, ప్రతికూల పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామన్నారు. బుధవారం కుందన్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్‌ నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్‌, ఈఎన్సీ రమేశ్‌బాబు, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 05:54 AM