Share News

వ్యవసాయ వర్సిటీ వీసీ జానయ్యకు నోటీసులు

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:53 AM

వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్‌ జానయ్యకు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది

వ్యవసాయ వర్సిటీ వీసీ జానయ్యకు నోటీసులు
protest

  • 12న విచారణకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆదేశం

  • లైంగికంగా వేధించారని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఫిర్యాదు

  • సీఎం జోక్యం చేసుకోవాలంటూ ఉద్యోగ సంఘాల ర్యాలీ

  • జానయ్యను తొలగించాలని డిమాండ్‌

హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్‌ జానయ్యకు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించింది. 12వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లోని మహిళా కమిషన్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వ్యవసాయ వర్సిటీలో పని చేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ముసిని తేజశ్రీ ఈ నెల ఏడో తేదీన మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధించారని, బెదిరిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పిటిషన్‌ సమర్పించగా.. ఈ మేరకు నోటీసు జారీ అయింది. ఈ విషయమై బాధితురాలు తేజశ్రీ.. ఇప్పటికే ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వీసీ జానయ్య వేధిస్తున్న తీరును వివరించారు.

ఈ నెల 7వ తేదీన యూనివర్సిటీ బోధన, బోధనేతర ఉద్యోగ సంఘాల నేతలు, పీహెచ్‌డీ స్కాలర్స్‌, విద్యార్థులు... బాధితురాలు తేజశ్రీతో కలిసి రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాల ఆవరణలో నిరసన చేపట్టారు. వీసీని పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు. తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించి వీసీకి నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ ఘటనపై సీఎం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కళాశాల నుంచి వర్సిటీ పరిపాలన భవనం వరకు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు ఉద్యోగులు విలేకరులతో మాట్లాడారు.


వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాట వినని మహిళా అధికారులను బదిలీ చేయడం సర్వ సాధారణమైపోయిందని జగిత్యాల వ్యవసాయ కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సునీత పేర్కొన్నారు. తేజశ్రీని వీసీ వేధించాడని తెలుసుకుని ఓ మహిళగా ఆమెకు అండగా నిలవాలనే ఇక్కడికి వచ్చానన్నారు. దీనిపై సీఎం రేవంత్‌ స్పందించి విచారణ కమిటీ వేయాలని కోరారు. వీసీ ఫోన్‌లో వేధిస్తున్నాడని, చాంబర్‌కు పిలిచి ఇష్టానుసారంగా మాట్లాడాడని మూడు నెలల క్రితమే తేజశ్రీ చెప్పిందని మైక్రో బయాలజీ విభాగం హెడ్‌ త్రివేణి పేర్కొన్నారు. తమకు వీసీపై ఎలాంటి కోపం లేదని, ఒక మహిళకు జరిగిన అన్యాయంపై విచారణ జరగాలని కోరుకుంటున్నామని నాన్‌టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ టెక్నికల్‌ కార్యదర్శి సులోచన పేర్కొన్నారు.

వీసీపై ఆరోపణలు సరికాదు

బదిలీ చేసినందుకే కొందరు ఉద్యోగులు వీసీ జానయ్యపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నాన్‌ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, అధ్యాపకులు పేర్కొన్నారు. వీసీకి మద్దతుగా నాన్‌టీచింగ్‌ ఎంప్లాయీస్‌తోపాటు అధ్యాపకులు వ్యవసాయ కళాశాలలో సమావేశమై.. అనుకూలంగా నినాదాలు చేశారు. బదిలీ అయిన వారందరూ ఏకమై వీసీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వయోపరిమితి పెంపు సాధ్యం కాని వారు సైతం దీనికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. వీసీగా బీసీ ఉన్నందునే కుట్రలు చేస్తున్నారన్నారు. కాగా, వ్యవసాయ వర్సిటీలో పనిచేస్తున్న తెలంగాణేతరులను వారి స్వరాష్ట్రాలకు పంపించాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మానవతరాయ్‌ కోరారు.

ఇవి కూడా చదవండి..

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ

Updated Date - Nov 10 , 2026 | 05:11 AM