తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:41 AM
తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్, హైదరాబాద్‌లో ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం
భారత్.. ఏఐ పవర్ హౌస్‌గా మారాలి
కేంద్రంలో ఏఐకి మంత్రిత్వ శాఖ ఉండాలి
మానవ పరిణామ క్రమంలో ఏఐ..శక్తిమంతమైన మలుపు: సీఎం రేవంత్
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో రేవంత్ ప్రసంగం
డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ రోల్ మోడల్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్, హైదరాబాద్‌లో ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్ పవర్ హౌస్‌గా మారాలని ఆకాంక్షించారు. కేంద్రంలో ఏఐ కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో సీఎం రేవంత్ కీలక ప్రసంగం చేశారు.
దేశ, విదేశాల నుంచి విచ్చేసిన విధానకర్తలు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మానవజాతి సాధించిన అత్యున్నత ఆవిష్కరణ కృత్రిమ మేధ (ఏఐ). గతంలో నిప్పును కనుగొన్నప్పుడు, చక్రాన్ని ఆవిష్కరించినప్పుడు, పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ప్రపంచం ఎలాంటి పెను మార్పులకు లోనైందో.. ఇప్పుడు ఏఐ వల్ల కూడా అలాంటి పరివర్తనాత్మక క్షణాలను మనం చూస్తున్నాం’’ అని అన్నారు. విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని పేర్కొన్నారు. ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ మాత్రమే కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపు అని తెలిపారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు.
జమనిషి మేధస్సుకే సవాల్..
‘‘గతంలోని ఆవిష్కరణలు మనిషి శారీరక శ్రమను తగ్గిేస్త, ఏఐ నేరుగా మనిషి మేధస్సుకే సవాల్ విసురుతోంది. స్వయం ప్రతిపత్తి, నిర్ణయాధికారం కలిగిన ఏఐ.. రోబోటిక్స్‌కు తోడైతే అద్భుతాలు సృష్టిస్తుంది’’ అని సీఎం రేవంత్ అన్నారు. ఏఐతో పోటీ పడటంలో ప్రపంచం ఇప్పటికే బిజీ అయిపోయిందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ... ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని అన్నారు. ేసవలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. సెమీ కండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫాంలు, అప్లికేషన్లలో భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూం నిర్వహించేందుకు తెలంగాణ సిద్థంగా ఉందని ప్రకటించారు.
ఏఐ యూనివర్సిటీని స్థాపించాలి..
ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని భారత్‌లో స్థాపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి సూచించారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై నెలకొంటున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉందన్నారు. అయితే, సరైన రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐతో సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని పేర్కొన్నారు. యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలన్నారు. స్టార్ట్‌పలకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా ేసవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలన్నారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు. ఈ భారీ సదస్సును ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రేవంత్ అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ రోల్ మోడల్