Share News

ఏప్రిల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:57 AM

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ...

ఏప్రిల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం

  • పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ చేపడదాం: సీఈఓ సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఎటువంటి లోపాలు తలెత్తకుండా.. అత్యంత పారదర్శకంగా చేపడదామని, ఎన్నికల విభాగాలు ప్రత్యేక దృష్టి నిలపాలని అధికారులను ఆదేశించారు. సీఈవో కార్యాలయం నుంచి శుక్రవారం మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల సహాయ ఎన్నికల నమోదు అధికారులకు (ఏఈఆర్‌ఓలు) ఆన్‌లైన్‌ వేదికగా శిక్షణ నిర్వహించారు. ఇందులో ఓటరు జాబితాల తయారీ, నవీకరణ, నిర్వహణ అంశాలపై, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాల సవరణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాల స్వచ్ఛతను కాపాడటంలో ఏఈఆర్‌ఓల పాత్ర కీలకమని, తెలంగాణలో చేపట్టనున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయా విభాగాలు సన్నద్ధం కావాలని తెలిపారు. ఈ సవరణ ప్రక్రియలో అత్యాధునిక సాంకేతికత వినియోగించనున్నామని, ఇందులో భాగంగా వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలను వేగవంతంగా పరిశీలించాలని చెప్పారు. ఓటరు జాబితాను సమగ్రంగా రూపొందించడంతోపాటు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించినట్లు సీఈఓ పేర్కొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 03:58 AM